Home Page SliderInternational

మహిళలకు మణిహారం ‘మహిళాదినోత్సవం’

“ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు పూజింపబడతారు” అనేది ప్రాచీన భారత ఆర్యోక్తి. మహిళల సమానత్వం , గౌరవం ముఖ్య లక్ష్యాలుగా మహిళా దినోత్సవం ఏర్పాటు చేయబడింది. ఈరోజున(మార్చి 8) ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు ఈ మహిళాదినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు. ఇది ఎప్పుడు మొదలయ్యింది వంటి విషయాలను అవలోకిద్దాం. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటాం. మొట్టమొదటిసారిగా జాతీయ మహిళాదినోత్సవాన్ని 1909లో ఫిబ్రవరి 8 నాడు న్యూయార్క్ నగరంలో సోషలిస్టు పార్టీ  తరపున కార్మిక కార్యకర్త థెరిసామల్కెయిల్ నిర్వహించారు. అయితే అది కేవలం జాతీయస్థాయిలోనే అమెరికాలో జరిగింది.

న్యూయార్క్ నగరంలోని రెడీమేడ్ వస్త్రాల కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ మహిళలకు సమాన హక్కులు, సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి సంవత్సరం మహిళాదినోత్సవం జరపాలని కోరుకున్నారు. అనంతర కాలంలో ‘మార్చి 8’ ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రశాంతంగా జీవించే హక్కు ఉందని నొక్కి వక్కాణించింది. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కలుగజేసింది. లింగబేధాలు పాటించకూడదని ప్రతీ సంవత్సరం మహిళాదినోత్సవం రోజున ఒక ‘థీమ్‌’ను కూడా ప్రవేశపెడుతోంది. సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యక్రమాలలో స్త్రీ,పురుష బేధాన్ని చూడకుండా సమాన అవకాశాలు కల్పించాలని ప్రతిపాదిస్తూ, ప్రచారం చేస్తున్నారు.

గత సంవత్సరం ‘బుక్స్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ’ అనే థీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిని  మహిళలు, బాలికల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉద్దేశించారు. లింగ వివక్షతను ఎదిరిస్తూ ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడానికి ఈ థీమ్‌ను ప్రవేశపెట్టారు.  ఈ సంవత్సరం 2023 లో ‘డిజిటాల్  ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ’  అనే థీమ్‌ను ప్రవేశపెట్టారు. అంటే టెక్నాలజీలో కూడా లింగ సమానత్వాన్ని ఇవ్వాలి.  అంతేకాదు ఆరోగ్యం, అభివృద్ధి కోసం మహిళలకు, బాలికలకు కూడా సమాన అవకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో దీనిని ఏర్పాటుచేశారు.

ఇప్పటికీ చాలా దేశాల్లో మహిళలు వెనుకబడే ఉన్నారు. పురుషులతో సమానంగా ముందడుగు వేయలేకపోతున్నారు. మహిళల స్థితిగతులు బాగుపడకుండా సమాజంలో మార్పులు రావు. దేశం టెక్నాలజీ పరంగా ఎంత ముందడుగు వేసినా,  మహిళల పట్ల, వారి విద్య,అవకాశాల పట్ల చాలా గ్రామాలలో ఇంకా సరైన మార్పు రాలేదు. మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అత్యాచారాలు దీనికి నిదర్శనం. మహిళలను మనిషిగా కాక ఇంటిపనులు చేసే, పిల్లలను కనే యంత్రాలుగా భావించే మగవారికి కొదవలేదు. స్త్రీని తన హక్కుగా భావించే మగవారి మనస్తత్వంలో సమూలంగా మార్పులు రావాలి.

సమాజంలో సగభాగమైన స్త్రీలకు సమానత్వాన్ని ఇవ్వడమే వారికి ఇచ్చే అసలైన గౌరవం. ఇది ఇంటినుండే మొదలు కావాలి. తల్లిదండ్రుల ఆలోచనా సరళిలో కూడా మార్పులు రావాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా అన్ని రంగాలలో ప్రోత్సహించాలి. ‘ఆకాశంలో సగం, అవకాశంలో సగం’, అంటూ మహిళలకు సమాన హక్కులు లభించే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిద్ధాం.