‘నవ్వు -నవ్వించు’ …ఈ రోజే ‘ప్రపంచ ఆనందదినోత్సవం’
‘ఆనందమే జీవిత మకరందం’ అన్నాడో సినీకవి. ప్రజలందరూ సంతోషంగా ఉంటే ప్రపంచ తీరుతెన్నులే మారిపోతాయి. అందరూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తే ఈ యుద్ధాలు, కుతంత్రాలు ఉండవు. ఈరోజు మార్చి 20 ని ప్రపంచ ఆనందదినోత్సవం( World happiness day) గా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. మొట్టమొదటి సారిగా 2013లో ప్రజల్లో సంతోషం వెల్లివిరియాలనే ఉద్దేశ్యంతో మార్చి 20 నాడు అంతర్జాతీయ ఆనంద దినోత్సవం నిర్వహించింది.

ఇటీవల విడుదలైన ‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ‘ ప్రకారం భారత్‌కు 136 వ ర్యాంకు లభించింది. మనకన్నా ఆర్థికంగా వెనుకబడిన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు కూడా ఆనందం ర్యాంకింగ్‌లో ముందంజలో ఉన్నాయి. దీనిని బట్టి మనదేశంలో ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవచ్చు. పేదలు మరింత పేదవారవడం, ధనవంతులు మరింత ధనవంతులవడం, జనాభా విపరీతంగా పెరిగిపోవడం, వైద్యఖర్చులు పెరిగిపోవడం, మహిళలపై నేరాలు పెరిగిపోవడం వంటి కారణాలతో ప్రజలు సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, తాలిబన్ల పాలనలో మగ్గుతున్న ఆఫ్గనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది.

ఒక దేశం యొక్క ఆర్థికాభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యం వంటివి ఆదేశ ప్రజల మీదే ఆధార పడి ఉంటాయి. ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉంటే వారి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా జాతీయోత్పత్తి పెరిగి దేశం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం, ఇతరులను కూడా తమ సంతోషంలో భాగస్వాములను చేయడం, బంధాలను బలపరుచుకోవడం మనిషి సంతోషంగా ఉండడానికి తోడ్పడతాయి. అందుకే ఈ ఒక్కరోజైనా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించి మంచి వాతావరణంలో రోజు గడుపుదాం.