పరమశివుని “విశ్వాస్ స్వరూపం” ఆవిష్కరణ నేడే
ఈశ్వరునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో శివభక్తులకు కన్నులపండుగ కాబోతోంది. ప్రపంచంలోనే ఎతైన పరమశివుని విగ్రహం ఈరోజు ప్రారంభించబడుతోంది. రాజస్తాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారా అనే పట్టణంలో అత్యంత ఆధునిక హంగులతో 369 అడుగులు ఎత్తు ఉన్న ఈశ్వర విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మొరారి బాపు ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. దీనిని విశ్వాస్ స్వరూపంగా పేర్కొంటున్నారు. ఈ విగ్రహ ప్రత్యేకతలు తెలుసుకుందాం.

ఈ విగ్రహం మూడువేల టన్నుల స్టీల్, 2.5 లక్షల క్యూబిక్ టన్నలు కాంక్రీట్, ఇసుకలను వాడి నిర్మించారు. ఈ నిర్మాణానికి పది సంవత్సరాల కాలం పట్టింది. 2012 ఆగస్టులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గహ్లాత్ దీనికి శంకుస్థాపన చేశారు. మొరారి బాపు ఆధ్వర్యంలో భూమి పూజ కూడా నిర్వహించారు.
ఇది ఉదయ్‌పూర్‌కు 45 కి.మీల దూరంలో ఉంది. తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ దీనిని నిర్మించింది. దాదాపుగా 32 ఎకరాల విస్తీర్ణంలో ఓ కొండపై ఏర్పాటు చేయబడిన ఈ విగ్రహం 20 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తుంది. ఈ విగ్రహానికి విండ్ టన్నెల్ అనే పరీక్షను కూడా నిర్వహించారు. 250 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలిని కూడా తట్టుకోగలదు.

ఈ విగ్రహం లోపలికి వెళ్లేందుకు నాలుగు లిఫ్టులు, మూడు మెట్లమార్గాలు ఉన్నాయి. రాత్రిపూట కూడా విద్యుత్ వెలుగులతో కాంతులీనుతూ ఉండేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. దీనిని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేశారు. వచ్చేవారి కోసం బంగీ జంపింగ్, జిప్ లైన్, గో కార్ట్, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ మొదలైన ఆకర్షణలు ఏర్పాటు చేశారు.
ఈ రోజు (శనివారం) విగ్రహావిష్కరణ అనంతరం తొమ్మిది రోజుల పాటు అంటే నవంబరు 6 వరకూ ఎన్నో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సంస్థాన్ ట్రస్ట్ నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో మొరారి బాపు తొమ్మిదిరోజుల పాటు రామ్‌కథను పఠించనున్నారు. ఈ అద్భుతమైన పరమేశ్వరుని విగ్రహం భారతదేశానికే ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో కొత్త శోభను తీసుకుని రాబోతోంది.