InternationalNewsNews Alert

జాబిల్లిపై మానవరహిత అర్టెమిస్-1 ప్రయోగం నేడే

చందమామ రావే, జాబిల్లి రావే అంటూ చిన్నప్పుడు చందమామను చూస్తూ, అమ్మ చేతి గోరుముద్దలు తినడం అందరికీ మంచి అనుభవం. ఆ చందమామ రాలేదు కానీ, మనిషి ఏనాడో జాబిల్లిపై కాలు మోపాడు. అమెరికా అంతరిక్షనౌక అపోలో ప్రాజెక్టు ద్వారా 1969 లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిసాయి. అయితే ఇవి కేవలం సోవియట్ యూనియన్‌పై ఆధిపత్యం కోసం జరిగిన యాత్రలుగానే మిగిలిపోయాయి. ఏనాడూ వ్యోమగాములు మూడురోజులకు మించి చందమామపై గడపలేదు. ఇన్నాళ్లకు మళ్లీ 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపై మనిషిని పంపే ప్రక్రియకు స్వీకారం చుట్టింది నాసా. అయితే ఈసారి గతంలోలా కాకుండా చంద్రుడిపై శాశ్వత మానవనివాసానికే పునాదిరాయి వేయబోతోంది.

 దీనికోసం నాసా అర్టెమిస్-1 అనే ప్రయోగం చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు అత్యంత శక్తివంతమైన మానవరహిత రాకెట్‌ను చంద్రుడిపైకి పంపబోతోంది. దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారంటే గ్రీకు పురాణాల ప్రకారం జ్యూస్ అనే దేవుని కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఈ అర్టెమిస్ యాత్రలను దఫదఫాలుగా చేయబోతున్నారు. ఈ యాత్రలలో ఒక మహిళా వ్యోమగామికి కూడా చోటు కల్పిస్తున్నందున నాసా ఈ పేరును ఎంచుకుంది.

 ఈ ప్రాజెక్టుకోసం 9,300 కోట్ల డాలర్లు నాసా ఖర్చు చేస్తోంది. ఈ అర్టెమిస్- 1 కోసం 400 కోట్ల డాలర్లు ఖర్చు కానుంది. ఇది 42 రోజుల పాటు సుమారు 13 లక్షల కిలోమీటర్లు  ప్రయాణించి చంద్రుని చేరుకుంటుంది. ఈ అర్టెమిస్-1లో 10 బుల్లి ఉపగ్రహాలు ప్రయోగించబోతోంది నాసా. ఒరాయిన్ నుండి విడిపోయాక అవి చంద్రుని దిశగా పయనమవుతాయి. దీనిలో బయో సెంటినిల్ అనే ఉపగ్రహం చంద్రునిపై రేడియో ధార్మికతను, సూక్ష్మ గురుత్వాకర్షణ వంటివి సూక్ష్మజీవులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో పరిశీలిస్తుంది.

నియో స్కౌట్ అనే  మరో ఉపగ్రహం సౌర తెరచాప సాయంతో సమీపంలోని గ్రహశకలం వద్దకు ప్రయాణమవుతుంది. ఐస్‌క్యూబ్ అనే మరో క్యూబ్‌శ్యాట్ చందమామపై మంచు నిక్షేపాలను పరిశోధిస్తుంది.

మరిన్ని పరిశోధనల కోసం ఒరాయిన్‌లో మొక్కల విత్తనాలు, అల్గే, ఫంగస్, ఈస్ట్ వంటివి కూడా పంపిస్తున్నారు.

అంతేకాదు అర్టెమిస్- 1 మానవ రహిత యాత్ర అయితే, తర్వాత జరిగే ప్రయోగాలలో మనుషులను కూడా పంపబోతున్నారు. 2024లో అర్టెమిస్-2 యాత్రను నిర్వహిస్తారు. దీనిలో 4గురు వ్యోమగాములను పంపుతారు. కానీ వారు చంద్రునిపై దిగరు. చంద్ర ఉపరితలానికి 9వేల కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో చంద్రుని చుట్టివస్తారు. ఇది కనుక విజయవంతమైతే విశ్వంలో మనిషి ప్రయాణించిన అత్యంత దూరం ఇదే అవుతుంది.

2025లో అర్టెమిస్-3 యాత్ర మానవజాతికి చాలా కీలకమైనది. దీనిలో ఒక మహిళతో పాటు నలుగురు వ్యోమగాములు ఉంటారు. వీరు చంద్రుని ఉత్తర ధ్రువంపై కాలు పెడతారు. దీనికోసం ఒరాయిన్‌తో పాటు SPACE-X కు చెందిన స్టార్ షిప్‌తో అనుసంధానమవుతుంది. ఇది తొలుత చంద్ర కక్ష్యలోని స్టార్‌షిప్‌తో అనుసంధానమై, ఒరాయిన్ నుండి వ్యోమగాములు దీనిలో ప్రవేశిస్తారు.

సుదూర అంతరిక్ష యాత్రలకు గేట్‌వే పేరుతో చంద్రుని కక్ష్యలో ఒక మజిలీ కేంద్రాన్ని కూడా నాసా ఏర్పాటు చేయబోతోంది. ఇది ఇకపై జరుగబోయే గ్రహాంతర యానానికి , విడిదిగా ఉపయోగపడబోతోంది. ఈ యాత్రలు విజయవంతమై మానవులు అంతరిక్షయానానికి బాటలవుతాయని ఆశిద్దాం. నాసా విడుదల చేసిన ఈ ఉపగ్రహ వీడియోను చూసి ఆనందిద్దాం.