NationalNews

మోదీ.. షా గడ్డపైనే తొలి పోరు

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల గడ్డపై తొలి పోరు గురువారం జరగనుంది. గుజరాత్‌లో డిసెంబరు ఒకటో తేదీన తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ కాషాయ గడ్డపై నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. మోదీ, షాల పుట్టినిల్లు అయిన గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ జెండాను రెపరెపలాడించాలని కాషాయ దళం కంకణం కట్టుకుంది. అయితే.. కాషాయ కంచుకోటను ఈసారి ఎలాగైనా కూలగొట్టి కాంగ్రెస్‌ జెండాను పాతాలని ఆ పార్టీ శ్రేణులు హోరాహోరీ శ్రమిస్తున్నాయి. మరోవైపు పంజాబ్‌లో విజయోత్సాహంతో దూసుకొస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ రాకతో గుజరాత్‌లో ముక్కోణపు పోటీ నెలకొంది.

89 స్థానాలకు పోలింగ్‌..

182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో గురువారం దక్షిణ గుజరాత్‌, కచ్‌-సౌరాష్ట్ర ప్రాంతాలతో కూడిన 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. తొలి దశ బరిలో క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ, ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా, బీజేపీ సీనియర్‌ నేతలు పురుషోత్తమ్‌ సోలంకి, కువర్జీ బవారియాతో పాటు 788 మంది అభ్యర్థులు ఉన్నారు. మిగిలిన 93 స్థానాలకు 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

చక్రం తిప్పుతున్న మోదీ, షా..

బీజేపీ తరఫున ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు. ప్రచార వ్యూహకర్తగా అమిత్‌ షా చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్‌ ప్రచార బాధ్యతను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ పైన వేసుకున్నారు. ఆప్‌ తరఫున ప్రచార బాధ్యతలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భుజానెత్తుకున్నారు. ఎన్నికల సభలకు దీటుగా సోషల్‌ మీడియాను కూడా బీజేపీ, ఆప్‌ విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వెనుకబడిందనే చెప్పాలి. క్షత్రియ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల ఓట్లపైనే కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది.