Andhra PradeshHome Page Slider

నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి

తెలుగువారికి ప్రత్యేకరాష్ట్రం కావాలనే తపనతో ప్రాణత్యాగానికి కూడా వెరవని అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి నేడు(డిశెంబర్ 15). ఈ సందర్భంగా ఆ మహనీయుని త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. 1901 మార్చి 16న మద్రాసులోని జార్జిటౌన్‌లో జన్మించారు పొట్టి శ్రీరాములు. ఆయన స్వగ్రామం కనిగిరి ప్రాంతంలోని పడమటి పల్లె గ్రామం. ఆ కాలంలోనే బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివిన విద్యావేత్త ఆయన. చదువు పూర్తయ్యాక బ్రిటిష్ ఇండియా పాలనలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి నాలుగేళ్లు ఉద్యోగం కూడా చేశారు.

గాంధీజీ బోధనలకు ఆకర్షితులై అనంతర కాలంలో ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరి, స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి జాతీయోద్యమాలలో పాల్గొని జైలుశిక్షలు కూడా అనుభవించారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్య్రం సాధించవచ్చని మహాత్మాగాంధీ అంతటి వారే మెచ్చుకున్నారు. హరిజనోద్ధరణ కోసం ఎంతగానో శ్రమించారు శ్రీరాములు. నినాదాలు మెడకు తగిలించుకుని మరీ ప్రచారాలు చేసేవారు. మండుటెండలలో చెప్పులు, గొడుగు కూడా లేకుండా ప్రచారాలకు పూనుకున్న మహానుభావుడాయన.

స్వాతంత్య్రానంతరం మద్రాసు రాజధానిగా ఉన్న తెలుగువారికి తగిన గౌరవం లేదని గ్రహించారు పొట్టి శ్రీరాములు. తెలుగువారికి ప్రత్యేకంగా భాషాప్రాతిపదికన రాష్ట్రం ఉంటే బాగుండుననే ఉద్దేశంతో ఆయన ఉద్యమం ప్రారంభించారు. కానీ ఆయనకు రాజకీయపెద్దలెవరూ అప్పట్లో కలిసి రాలేదు. ఆంధ్రకాంగ్రెస్ కమిటీ కూడా దీక్షను సమర్థించలేదు. దీనితో ప్రజలే శ్రీరాములుకు క్రమంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ఆయన దీనితో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. తెలుగురాష్ట్రాన్ని సాధించేవరకూ ఆహారం తీసుకోనని పట్టుపట్టారు. 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో మద్రాసులో నిరాహార దీక్షను ప్రారంభించారు. మద్రాసు మొదలు తంజావూరు వరకూ తెలుగువారితో నిండిపోయినా, తెలుగువారికి అక్కడ గుర్తింపులేదు. తమిళుల అవహేళనలు, దౌర్జన్యాలు మితిమీరిపోయేవి. తెలుగువారిని మద్రాసీయులు అని పిలిచేవారు. దీనితో తట్టుకోలేక రాజాజీని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించి, ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు శ్రీరాములు.

అక్టోబరు 19న మొదలు పెట్టిన ఆయన దీక్ష ఆయన చివరి ఊపిరి రోజైన డిసెంబర్ 15 వరకూ కొనసాగింది. 16 కేజీల బరువు తగ్గిపోయి, శ్వాస స్తంభించి, అపస్మారక స్థితిలోకి వెళ్లపోయి, రాత్రి 11.23 గంటలకు తెలుగు రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్నారు శ్రీరాములు. ఆయన మరణానంతరం ప్రజలు ఆగ్రహావేశాలకు గురై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మద్రాసు నుండి విశాఖపట్నం వరకూ ఆందోళనలు చేశారు. దీనితో చివరికి దిగివచ్చిన అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ డిసెంబర్ 19న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారు. అయితే రాజాజీ( రాజగోపాలాచారి) ఆంధ్రరాష్ట్రం ఏర్పడితే ఆంధ్రులు మద్రాసులో ఉండడానికి, రాజధాని పెట్టుకోడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు. చివరికి కర్నూలు రాజధానిగా1953అక్టోబర్ 1న బళ్లారి, బరంపురం, హోస్పేట, తిరువళ్లూరు వంటి తెలుగుప్రాంతాలను ఇతర రాష్ట్రాలకు వదులుకొని ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఇప్పటికీ మద్రాస్ మైలాపూర్‌లోని ఆయన ఇంటిని స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతోంది. ఆయన జ్ఞాపకార్థం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు.