కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా..
కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఏకంగా 2 వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన జరిగింది. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి నిర్మాణానికి గోషామహల్ స్టేడియంలో భూమి పూజ చేశారు. ప్రస్తుతం అఫ్జల్ గంజ్‌లో ఉన్న ఆసుపత్రిని ఈ కొత్త భవనంలోకి మార్చనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఈ ఆసుపత్రి మరో వందేళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఆపరేషన్ థియేటర్లు, ప్రతీ థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, డయాగ్నోస్టిక్ సేవలు, రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దీని నిర్మాణానికి రూ.2,500 కోట్ల నుండి రూ.2,700 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనాలు వేస్తున్నారు.