చిన్నారికి విజయవంతంగా గుండెమార్పిడి చేసిన తిరుపతి వైద్యులు
తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో వైద్యులు మంగళవారం నాడు 11 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించబడే ఈ ఆసుపత్రిలో ఈ ఆపరేషన్‌తో 10 గుండెమార్పడి శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. తెలంగాణలోని వనస్థలిపురానికి చెందిన 11 ఏళ్ల చిన్నారికి గుండెమార్పిడి అవసరమని గుర్తించి వైద్యులు ఇక్కడికి సిఫార్సు చేశారు. ఇక్కడ జీవన్‌ధాన్ ట్రస్టులో ఆమె పేరు నమోదు చేయించారు. దాత గుండె కోసం ఎదురు చూస్తుండగా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించగా అతని కుటుంబీకులు అవయవదానానికి అంగీకరించారు. దీనితో శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రిలో అతని గుండెను సేకరించి, హెలికాఫ్టర్‌లో వైజాగ్‌కు అక్కడి నుండి ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చారు. రేణిగుంట విమానాశ్రయం నుండి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, అప్పటికే ఆపరేషన్ థియేటర్‌లో సిద్దంగా ఉన్న బాలికకు అతని గుండెను అమర్చారు. డా. శ్రీనాథ్ రెడ్డి, డా. గణపతి అధ్వర్యంలో ఆపరేషన్ విజయవంతమయ్యింది.