NewsTelangana

మునుగోడులో తీన్మార్‌

మునుగోడులో తీన్మార్‌కు తెర లేచింది. ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ వెలువరించడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృత స్థాయిలో చేసేందుకు నడుం బిగించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు ఖరారైంది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఖాయంగా మారింది. టీఆర్‌ఎస్‌ ఇంకా అభ్యర్థి పేరును ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానమైన మునుగోడును కైవసం చేసుకునేందుకు ఇటు బీజేపీ.. అటు టీఆర్‌ఎస్‌ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్నాయి.

రాజగోపాల్‌ రెడ్డిపైనే భారం..

మునుగోడులో గెలిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ స్కెచ్‌ గీసింది. అందుకే రాజగోపాల్‌ రెడ్డి కోసం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మునుగోడులో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లో బలమైన నాయకులను బీజేపీలో చేర్చడంపై ఫోకస్‌ పెట్టింది. నియోజకవర్గంలోని 189 గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతోంది. 11వ తేదీన ప్రధాని మోదీ సైతం హైదరాబాద్‌ రానున్నారు. ఫలితంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు.

మునుగోడులోనే జాతీయ పార్టీ ప్రకటన..?

మునుగోడులో పట్టున్న వామపక్షాల మద్దతుతో విజయం సాధస్తామన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ ఉంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని సర్వేలు సైతం చెబుతున్నాయని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మునుగోడులోనే ప్రకటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పార్టీ అధినేత ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన రాజగోపాల్‌ బీజేపీలోకి వెళ్లడంతో ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలుతాయని.. టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు చెక్కు చెదరదని కేసీఆర్‌ ధీమాగా ఉన్నారు.

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు కష్టాలే..

కాంగ్రెస్‌కు మునుగోడు పట్టున్న నియోజక వర్గం. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూతురిగా స్రవంతికి బలమైన ఓటు బ్యాంకు ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది. అయితే.. ఆర్థిక, అంగ బలం లేకపోవడం ఆమెకు మైనస్‌ పాయింట్‌గా మారింది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ కేడర్‌ను బీజేపీలోకి తీసుకెళ్లడం క్షేత్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేసే ప్రమాదం ఉంది. అభ్యర్థి ఎంపికలోనూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కాదని పార్టీ అధిష్ఠానం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు ప్రతిపాదించిన స్రవంతి మాటకు విలువనిచ్చింది. మొత్తానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఎన్నికతో రాష్ట్ర రాజకీయ స్వరూపం మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.