1 నుంచి తిరుపతిలో 9 చోట్ల నుండి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. అదే రోజు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు చేయిస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. గత రెండేళ్లుగా వైకుంఠ దర్శనం ఎలా చేస్తున్నామో… ఇప్పుడు కూడా అలాగే దర్శనాలు చేయిస్తామన్నారు. జనవరి 2 తెల్లవారుజాము నుంచి 11 అర్ధరాత్రి వరకు వైకుంఠ దర్శనం చేయించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మేరకు టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్నామన్నారు. వైకుంఠ దర్శనం చేయించే పది రోజులు దర్శనం టికెట్ కలిగి ఉన్న భక్తులకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమితిస్తామన్నారు. దర్శనం టికెట్ లేని భక్తులు క్యూలైన్లో నిలుచుంటే.. క్యూలైన్స్ కిలోమీటర్ల పొడవున ఉంటే.. చలికి తట్టుకోవడం కష్టమవుతుందన్నారు ధర్మారెడ్డి. అందుకే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలక్కుండా… తిరుపతిలో సర్వదర్శనం SSD టోకెన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు.

దేశమంతటా కూడా ఆన్లైన్లో టోకెన్లు ఇవ్వడం వల్ల వెయిటింగ్ చేసే ప్రసక్తి ఉండదన్నారు. భక్తులు ఇబ్బందులకు గురికారన్నారు. రోజుకు 25 వేలు చొప్పున పది రోజుల్లో రెండున్నర లక్షల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. జనవరి నెలకు విడుదల చేసే కోటా తరహాలోనే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను రిలీజ్ చేస్తామన్నారు. శ్రీవారి సర్వదర్శనం ssd టోకెన్లు స్లాట్ల వారీగా ఇస్తామన్నారు. తిరుపతిలోని 9 సెంటర్లలో టికెట్లు అందిస్తామన్నారు. రోజుకు 50 వేల మందికి ఫ్రీ టోకెన్లు చొప్పున పది రోజుల్లో దాదాపు 5 లక్షల మందికి టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు.

మొత్తంగా 10 రోజులు 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. జనవరి 1 మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటర్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. మూడు షిప్టులుగా టికెట్ల పంపిణీ జరుగుతుందని… 5 లక్షల టోకెన్లు పూర్తయ్యే వరకు పంపిణీ కొనసాగుతుందన్నారు. ఏ రోజు కోటా ఆ రోజు ఇవ్వడం వల్ల భక్తులు మరుసటి రోజు కోసం 24 గంటల పాటు అక్కడే నిద్రాహారాలు మాని ఉండాల్సి వస్తోందని.. ఇకపై సమస్యల అలా ఉండబోదన్నారు. వైకుంఠద్వార దర్శనం టికెట్లన్నీ కూడా ఆధార్ ద్వారా అనుసంధానిస్తున్నామన్నారు. టోకెన్లు అన్నీ కూడా ఆధార్ కార్డు హోల్డర్స్కు మాత్రమే ఇస్తామన్నారు ధర్మారెడ్డి.