ఏపీ రాజధానిపై మూడు ముక్కలాట..!
ఓవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు రాజధాని సమరం.. ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధానిని వైజాగ్‌కు మార్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అమరావతి మాత్రమే రాజధాని అన్న భావన పోగొట్టేందుకు జగన్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అనడంపై ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన, బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

జగన్ ద్వంద్వ ప్రమాణాలు..
అమరావతి విషయంలో జగన్ కావాలని ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూములలిచ్చిన రైతులను నట్టేట ముంచేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా తాము అన్యాయమైపోతున్నామంటూ అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వారు చేస్తున్న ‘అమరావతి రాజధాని’ పోరాటం 1000 రోజులు కూడా దాటింది. తాజాగా ‘అమరావతి నుంచి అరసవెల్లి’ అంటూ రైతులు పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి మరీ రైతులు ఆందోళన బాట పట్టారు.

రాజధాని లేని రాష్ట్రం..
ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రమంటూ జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో హైకోర్టు సీజే దేవానంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు. ఈ తరుణంలో రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాలన్నీ రాజకీయంగా దుమారాన్ని రేపుతుంటే న్యాయపరంగానూ ఎన్నో చిక్కులు, సవాళ్లు ఎదురవుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో చేస్తున్న ప్రకటనలను ప్రధాన ప్రతిపక్షం ఎండగడుతోంది. అధికారంలోకి వచ్చాక ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. రైతుల త్యాగాలకు విలువ లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారాన్ని అంగీకరించబోమని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు.

మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా..?
మొత్తంగా రాజధాని అంశం ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని ఓవైపు చంద్రబాబు నాయుడు.. మరోవైపు అమరావతి రైతులు అంటుంటే.. ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల పల్లవి అందుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రజలను మానసికంగా ప్రిపేర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. టీడీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఖండిస్తోంది. ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపు ప్రతిపక్షం.. ఇంకోవైపు అమరావతి రైతులు.. ఎవరి వాదన వారు వినిపిస్తున్న తరుణంలో.. మూడు రాజధానులు కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు గాని.. రాయలసీమ ప్రజలు కానీ.. అడుగుతున్న సందర్భాన్ని చూసామా..? అంటే చెప్పలేం. వాస్తవానికి రాజధాని కావాలని విశాఖవాసులు, రాయలసీమ వాసులు డిమాండ్ చేసిన సందర్భం కూడా లేదు. కేవలం ప్రభుత్వం చేస్తున్న వాదనతో కొందరు ఏకీభవించారు. మరికొందరు విభేదించారు. అంతే.. ఏది ఏమైనా.. జగన్ సర్కారు ఎన్నికలకు వెళ్లే 2024కు ముందు అమరావతి రాజధాని ప్రధాన రాజకీయ అంశం అవుతుందని టీడీపీ ఆశపడుతోంది.

పట్టించుకోని ప్రజలు..
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటును సైతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దగా విమర్శించిన దాఖలాలు లేవు. ఎందుకంటే హైదరాబాద్ మీద ప్రేమ తప్పించి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించే సందర్భాన్ని చాలా మంది చూసి కూడా ఉండరు. ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నా.. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్తున్నా.. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని చెబుతున్నా.. ప్రజల్లో స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఇదే పాయింట్‌ను సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ప్రజలకు పథకాలు, స్కీములు కావాలి. అంతేతప్ప రాజధాని గురించి పెద్దగా ఆందోళన చెందుతున్నారని ఆయన భావించడం లేదు.

అందరి కళ్లూ సుప్రీంకోర్టుపైనే..
అయితే.. రాజధాని అంశం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫోకస్ అవుతుందని ఒక పార్టీ భావిస్తుంటే.. ప్రజలు రాజధాని అన్న అంశాన్ని పట్టించుకోరని అధికార పార్టీ విశ్వాసంతో ఉంది. ఇప్పుడు అందరి కళ్ళూ సుప్రీంకోర్టు తీర్పు పైనే ఉన్నాయి. వాస్తవానికి రాజధానికి సంబంధించిన ఎన్నో పిటీషన్లను హైకోర్టు విచారిస్తోంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంటుందా.. లేదా.. అన్నది కూడా సందేహమే. మొత్తానికి మూడుముక్కలాటగా సాగుతున్న రాజధాని అంశం అంత తేలికగా తెగేది కూడా అనుమానమే.
