మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త డివిజన్లు
ఏపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా నెలరోజులుగా పనిచేసిన మంత్రుల కమిటీ తన పరిశీలనలను పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించింది. గత రెండు రోజులుగా ఈ నివేదికపై మంత్రులతో విస్తృతంగా చర్చించిన సీఎం చంద్రబాబు నాయుడు , చివరకు కొత్త జిల్లాలపై తుది నిర్ణయానికి వచ్చారు.మార్కాపురం ,మదనపల్లె ,రంపచోడవరం ఈ మూడు కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.దీనితో పాటుగా ,నక్కపల్లి – అనకాపల్లి జిల్లా,అద్దంకి – ప్రకాశం జిల్లా,పీలేరు – మదనపల్లె జిల్లా,బనగానపల్లె – నంద్యాల జిల్లా,మడకశిర – సత్యసాయి జిల్లా ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా సర్కార్ ఏర్పాటు చేయనుంది.
వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో అనేక అవ్యవస్థలు చోటుచేసుకున్నాయని భావించిన కూటమి సర్కార్ దాన్ని సరిచేయడమే లక్ష్యంగా ముందడుగు వేసింది. అనేక ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పు, కొత్త డివిజన్ల ఏర్పాటుకు వచ్చిన డిమాండ్లను పరిశీలించిన కమిటీ, వ్యవస్థ చాలా విభజించబడితే పరిపాలనలో ఇబ్బందులు వస్తాయని సూచించింది.
సచివాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు జిల్లా, డివిజన్, మండలాల పునర్విభజన అంశాలపై విస్తృత చర్చ జరిపారు. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికకు సీఎం అధికారికంగా ఆమోదం తెలపడంతో, కొత్త జిల్లాలు–డివిజన్ల ఏర్పాటుపై స్పష్టత లభించింది.
ఈ నిర్ణయాలతో రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని, ప్రజలకు సేవలందించడం మరింత సులభం అవుతుందని అధికార వర్గాలు విశ్వసిస్తున్నాయి.

