ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారుల మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమీన్‌పూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, ఆయన భార్య రజితలు నివాసం ఉంటున్నారు. వారికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8)అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. చెన్నయ్య పొట్టకూటి కోసం వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలు ఇంట్లోనే భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత చెన్నయ్య ట్యాంకర్ నడిపేందుకు చందానగర్ వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. రజిత తలుపులు తెరవగా ఆ సమయంలో పిల్లలు నిద్రపోతున్నారు.శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపునొప్పి రావడం వల్ల స్థానికుల సహాయంతో చెన్నయ్య ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. ఆ తర్వాత పిల్లలను పరిశీలించగా అప్పటికే ముగ్గురు చిన్నారులు మృతిచెందినట్లు గుర్తించారు. కాగా చిన్నారుల మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
