InternationalNews

అమెరికా చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు బెదిరింపులు

ఇటీవల కాలంలో  అమెరికాలో జాత్యాహాంకార ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడ్డ భారతీయ సంతతిపై ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ సంతతికి చెందిన మొట్టమొదటి అమెరికా చట్టసభ్యురాలు ప్రమీలా జయపాల్‌ జాత్యాంహకార ఘటనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ద్వారా  తెలియజేశారు.

ఈ మేరకు ఆమెకు తాజాగా ఒక బెదిరింపు సందేశం వచ్చినట్లు ఆమె తెలిపారు. అందులో ఓ వ్యక్తి భయంకరమైన పదజాలంతో ఆమెను దూషిస్తూ..భారత్‌కు తిరిగి వెళ్ళిపోవాలని హెచ్చరించాడు. దీనిపై స్పందించిన ఆమె సాధారణంగా రాజకీయ ప్రముఖులు తమ దుర్బలత్వాన్ని ప్రదర్శించరన్నారు. కానీ ఇటువంటి హింసను ఎవరూ అంగీకరించలేరు. కాబట్టే ఈ వీడియోను బయటపెడుతున్నానని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ..జాత్యాహాంకారాన్ని, లింగ వివక్షతను లేవనెత్తే వారి చర్యలను ఏ మాత్రం సహించబోనని పేర్కొన్నారు.

అయితే  చెన్నైలో జన్మించిన ప్రమీలా జయపాల్ మొట్టమొదటి భారతీయ- అమెరికన్ చట్టసభ్యురాలు. ప్రస్తుతం ఆమె డెమోక్రటిక్ పార్టీకి చెందిన ప్రతినిథుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటీవ్స్)లో సియాటెల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలోనూ ఆమె ఇటువంటి జాత్యాహాంకార ఘటనను ఎదుర్కొన్నారు. సియాటెల్‌లోని ఆమె నివాసంలో ఓ వ్యక్తి గన్‌తో నిలుచోని బెదిరింపులకు దిగాడు. పోలీసులు అతన్ని  బ్రెట్ ఫోర్సెల్‌గా గుర్తించి,అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు భారతీయ అమెరికన్లపై ఇటువంటి జాత్యాహంకార ఘటనలు వరుసగా నమోదవుతూన్నాయి.  ఇలాంటి ఘటనలు ఈ నెల 1న కాలిఫోర్నియాలో… అంతకు ముందు టెక్సాస్‌లో నలుగురు మహిళలపైనా జరగడం గమనార్హం.