NationalNews

19 ఏళ్ల వయసులో వెయ్యి కోట్లు… వరల్డ్ రికార్డ్

కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఇది కొందరు లక్ష్యంగా పెట్టుకుంటారు. సాధారణంగా బతికే బతుకు.. బతుకు కాదని వారు ఫీలవుతారు. అందుకే కింద పడినా.. పైకి లేస్తారు. జీవితమంటే సాదాసీదా బతుకు కాదని వారు భావిస్తారు. అందకే వారి పేర్లు చరిత్ర పుటల్లో లిఖిస్తారు. అలాంటి ఇద్దరు ఇప్పుడు దేశీయ రిటైల్ మార్కెట్ సంచలనంగా మారారు. 20 ఏళ్ల వయసులోనే వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారు. అవును వారిద్దరూ ఎవరూ కాదు కైవల్య వోహ్రా, ఆదిత్ పాలిచా… ఇద్దరు దిగ్గజాలు హురున్ భారతీయ సంపన్నుల లిస్టులో 2022లో అత్యంత చిన్నవారిగా ఉంటూ రికార్డు సృష్టించారు. క్విక్ డెలివరీ స్టార్టప్ జెప్టో సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా, IIFL వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో చోటు దక్కించుకొని చరిత్ర తిరగరాశారు. 19 ఏళ్ల వయస్సులో, కైవల్య అత్యంత పిన్న వయస్కుడు.

అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో వెయ్యి కోట్ల నికర విలువతో కైవల్య 1036వ స్థానంలో నిలవగా… ఆదిత్ పాలిచా 950వ స్థానంతో 1,200 కోట్లు విలువను నమోదు చేశారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రభావవంతమైన అండర్ – 30 ఆసియా జాబితాలో చోటు దక్కించుకున్నారు. దేశంలోని స్టార్టప్‌ల పెరుగుతున్న ప్రభావాన్ని ఇద్దరి పురోభివృద్ధి స్పష్టం చేస్తోంది. గతంలో ఇలాంటి రికార్డు 37 ఏళ్ల వయసున్న వ్యక్తి బద్ధలుకొట్టగా.. ప్రస్తుతం ఆ రికార్డును 19 ఏళ్లు యువకుడు చెరిపివేయడం సంచలనమంటూ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ పేర్కొంది.

వోహ్రా, పాలిచా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు. కంప్యూటర్ సైన్స్ కోర్సును మధ్యలో విడిచిపెట్టి, కంపెనీలు స్థాపించడంపై దృష్టిసారించారు. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో అవసరమైన వస్తువులను, కాంటాక్ట్‌లెస్ డెలివరీ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చడానికి స్నేహితులిద్దరూ 2021లో Zeptoని ప్రారంభించి విజయం సాధించారు. 2018లో గోపూల్ పేరుతో విద్యార్థుల కోసం కార్‌పూల్ సేవను స్థాపించినప్పుడు పాలిచా 17 సంవత్సరాల వయస్సులోనే ప్రతిభ చాటాడు. జెప్టో ఆరంభించే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ప్రాజెక్ట్ అయిన ప్రవ్యాశీలో ప్రాజెక్ట్ లీడ్‌గా పనిచేశాడు.

దుబాయ్‌లో పెరిగిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు, ముంబైలోని స్థానిక దుకాణాల నుండి కిరాణా వస్తువులను డెలివరీ చేసే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కిరానాకార్ట్ అనే స్టార్టప్‌ను మొదట ప్రారంభించారు. ఇది జూన్ 2020 నుండి మార్చి 2021 వరకు పనిచేసింది. తర్వాత వారు ఏప్రిల్ 2021లో Zeptoని ప్రారంభించారు. నవంబర్‌లో ప్రారంభ నిధులుగా 500 కోట్ల సేకరించారు. క్విక్ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్ కూడా డిసెంబర్‌లో 4,600 కోట్ల విలువను చూపించి మరో 800 కోట్ల రూపాయలను సేకరించారు. ఐతే ప్రస్తుత వాల్యూ ప్రకారం 7,300 కోట్ల అంచనాతో మరో 1600 కోట్లను జప్టో ద్వారా సేకరించారు.