మంత్రివర్గంలో ఆ నలుగురు
తెలంగాణ మంత్రివర్గం విస్తరణ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుత విస్తరణలో నలుగురికి చోటు కల్పిస్తారని సమాచారం. వీరితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశమయ్యారు. వీరందరి భేటీలో కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టెన్నూకు ఎమ్మెల్యే వివేక్, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డిలకు మంత్రులుగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరు ఖాళీలను భర్తీ చేస్తే కనుక ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి ఒక్కొక్కరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఉప సభాపతిగా లంబాడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.


 
							 
							