Home Page SliderTelangana

తెలంగాణ ముస్లింల మద్దతు ఈసారి కేసీఆర్‌కా, కాంగ్రెస్ పార్టీకా?

మైనార్టీలకు ప్రత్యేకంగా చేసిందేంది?
ముస్లింలకు ఇచ్చిన హామీని గాలికొదిలేసిన కేసీఆర్
ఎన్నికల సమయంలో తాయిలాలతో ఎర
మజ్లిస్‌ను శాటిస్‌ఫై చేస్తే చాలాన్న భావన
కేసీఆర్‌ను నమ్మబోమంటున్న ముస్లిం సోదరులు

ప్రత్యేక తెలంగాణ తన వల్లే వచ్చిందని, ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా చేయగలిగానంటారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. చావు అంచుల వరకు వెళ్లాక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకుందంటారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేసీఆర్ ఆడుతున్న వింత రాజకీయంలో ఎన్నో వర్గాలు సమిధిలయ్యాయ్. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడమన్న ఆనవాయితీ కేసీఆర్ విషయంలో రుజవవుతోందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముస్లిం ఓట్లు తమ పార్టీకే పొందేలా కేసీఆర్ ఆడిన ఆటలు ఇప్పటి వరకు సఫలమయ్యాయి. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా… అదే లైన్లో ఇప్పుడు మెజార్టీ ముస్లిం యువత బీఆర్ఎస్ సర్కారుపై నిప్పులు చెరుగుతోంది. ఒవైసీతో సాన్నిహిత్యం సైతం కేసీఆర్‌కు ఈసారి ఓట్లను రాల్చేలా లేవన్న భావన కలుగుతోంది. ఒకప్పుడు భిన్నధ్రువాలుగా ఉన్న కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు నాణెనానికి ఉన్న బొమ్మా-బొరుసులా కలిసిపోయారు. 2014లో అత్తెసరు మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌కు మజ్లిస్ పరోక్షంగా సహకరించింది. ప్రభుత్వం నిలబడేందుకు దన్నుగా నిలిచింది.

ఒవైసీని నమ్ముకుంటే చాలు.. ముస్లింల మద్దతు లభిస్తోందన్న దీమా
రాష్ట్ర రాజధాని నగరంలో తన పాలనను శాశ్వతంగా కొనసాగించాలంటే హైదరాబాద్‌లో ఆధిపత్య ముస్లిం మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒవైసీ, ఆ పార్టీ పోషించాల్సిన ముఖ్యమైన పాత్రను తెలివిగల కేసీఆర్ ముందుగానే ఊహించారు. దీంతో ఒవైసీతో దోస్తీ కుదుర్చుకున్నారు. 2014 నుండి, కాంగ్రెస్‌తో రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి క్రెడిట్‌ తనకు కాకుండా పోతుందన్న వర్రీలో కూడా కేసీఆర్ ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీని చీల్చి, గులాబీ పార్టీలో విలీనం చేసుకున్న కేసీఆర్, ఆ తర్వాత ఆ పార్టీని నిందించడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఒవైసీకి, కాంగ్రెస్‌తో కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సీన్ మారిపోయింది. ఇలా రెండు పార్టీలు కాంగ్రెస్‌ను కాదని… ముస్లింలకు తామే హక్కుదారులమన్న భావనకు వచ్చారు. కేసీఆర్, ఒవైసీ ఇద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా చూడటం ప్రారంభించారు. రాజకీయ సుస్థిరత రూపంలో అధికారాన్ని అనుభవించే లక్ష్యంతో ఇద్దరు నాయకులకు ఉమ్మడిగా పనిచేయడం మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, మతపరమైన అల్లర్లను ఏమాత్రం సహించకుండా బీఆర్‌ఎస్ పాలనలో ముస్లింలు సురక్షితంగా ఉండేలా కేసీఆర్ హామీ ఇచ్చారు. షాదీ ముబారక్, ఉద్యోగాలు, విద్యలో 12 శాతం కోటా, పాతబస్తీని ఇస్తాంబుల్ తరహాలో అభివృద్ధి చేస్తానంటూ ముస్లిం మైనారిటీల మనసు గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. ఉమ్మడి ఆంధ్రలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 4% ముస్లిం కోటాను తమ పార్టీ రద్దు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ర్యాలీలో చెప్పినప్పుడు… ఇద్దరు నేతలు విభేదించారు. ఇంతలో, మజ్లిస్ మద్దతు 2014 నుండి ఎన్నికలలో కేసీఆర్‌కు గొప్ప ప్రతిఫలం దక్కేలా చేసింది. 2023లో హ్యాట్రిక్ కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఒవైసీ మద్దతుపై ఆధారపడి ఉంటుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముస్లిం ఓటర్ల రాజకీయ మూడ్ మారిపోవడంతో ఒవైసీ, కేసీఆర్‌ల వ్యూహాలు, పథకాలు పని చేయడం కష్టంలా సీన్ కన్పిస్తోంది.

ముస్లిం ఓట్ల గెలిచేలా కాంగ్రెస్ కర్నాటక మంత్రాంగం
మజ్లిస్ కవచంలో చిక్కులు ఉన్నాయి. ఒవైసీని మోడీ ప్రభుత్వానికి B-టీమ్‌గా చిత్రీకరించడానికి కాంగ్రెస్ దాని నిరంతర ప్రయత్నాలలో కొంత విజయాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల పోరాటాలకు దిగడం, కాంగ్రెస్ ఓట్లను చేజిక్కించుకోవడం ద్వారా ఓట్ల కోత పెట్టే పార్టీగా ఆవిర్భవించడంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీతో మజ్లిస్ శత్రుత్వాన్ని పెంచుకోడానికి కారణమయ్యింది. ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలలో మజ్లిస్ ప్రవేశం మహారాష్ట్ర, బీహార్‌లలో BJPకి గణనీయంగా సహాయపడింది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కూడా ఒవైసీ ఉనికి చాటారు. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక ముస్లింల పట్ల చేసిన కృషి విఫలమైంది. ముస్లింల ఓట్లు కేవలం మజ్లిస్‌కి మాత్రమే కాకుండా SDPI వంటి సారూప్య సంస్థతోపాటుగా, “సెక్యులర్” ముద్రపడిన జేడీఎస్‌ను కాదని, కాంగ్రెస్‌కు ఏకపక్షంగా కర్నాటక ప్రజలు ఓటేయడంతో తిరిగులేని విజయాన్ని హస్తం పార్టీ పొందగలిగింది. కర్నాటక ధోరణి కేసీఆర్‌కు ఆందోళన కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా పునరావృతమవుతోందని ఆ పార్టీ వర్రీ అవుతోంది.

కేసీఆర్‌ను నమ్మేదెలా? దూరమవుతున్న ముస్లింలు
సొంత రాష్ట్రంలో మతపరమైన శాంతి దూతగా తనను తాను ప్రదర్శించుకున్నప్పటికీ, బీజేపీకి వ్యతిరేకంగా క్రూసేడర్‌గా కేసీఆర్ వ్యూహాలు నమ్మశక్యంగా లేవు. మూడో ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు ఎక్కడా లేవు. సంప్రదాయవాద ముస్లింలు హిజాబ్ సమస్య, ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందినప్పుడు రాజ్యసభలో కేసీఆర్ పార్టీ గైర్హాజరు వంటి విషయాలపై కేసీఆర్ మౌనం వహించడం చర్చనీయాంశమయ్యింది. తెలంగాణలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల గుండా 15 రోజుల పాటు సాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముస్లిం మైనార్టీల మూడ్‌లో మార్పుకు ట్రిగ్గర్‌గా పనిచేసింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఏఐఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని, అందుకే దేశవ్యాప్తంగా విపక్ష నేతలపై దాడులు జరుగుతున్నా కేసీఆర్‌, ఒవైసీల జోలికి వెళ్లలేదని ఖమ్మం ర్యాలీలో రాహుల్‌ కుండబద్ధలుకొట్టారు. పార్లమెంటులో ముస్లిం వ్యతిరేక బిల్లులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతిచ్చి టీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసినందున మా మద్దతును కొనసాగించలేమని జమాతే ఇస్లామీ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మూడ్‌ని సూచిస్తున్నాయి. జమియత్ ఉలేమా-ఎ-హింద్ (తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్) మాజీ అధ్యక్షుడు హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ కూడా తన 12 శాతం కోటా హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని, చట్టం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ కేసీఆర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓవైసీ చెప్తే బీఆర్ఎస్‌కు ఓటేయాలా?
తెలంగాణ ముస్లిం ఓట్లను ఓవైసీ, కేసీఆర్ దగ్గర తాకట్టు పెడుతున్నారనే భావనలో మైనార్టీలున్నారు. ఇది విద్యావంతుల్లో అసహనానికి కారణమవుతోంది. అదే సమయంలో ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని వారు మండిపడుతున్నారు. మైనార్టీలకు లక్ష సాయం బూమ్ రాంగ్ అవడం కూడా కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. లక్ష రూపాయల సాయం పేరిట కేసీఆర్ ముస్లింలను చీట్ చేశారని చాలా మంది భావిస్తున్నారు. తెలంగాణలో 15 శాతంపైగా ఉన్న జనాభాలో 70 శాతానికిపైగా దిగువ మధ్యతరగతి వారేనని… లక్షరూపాయల పేరుతో వంచిస్తారా అంటూ మండిపడుతున్నారు. వక్ఫ్ బోర్డ్‌కు జ్యుడిషియరీ పవర్స్ ఇస్తామని గాలికొదిలేశారని, చాలా వరకు వక్ఫ్ భూములను కేసీఆర్ అండతో మజ్లిస్ నాయకులు దోచుకుంటున్నారని హైదరాబాదీలు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా మైనార్టీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తానని కూడా మాట తప్పారని ఆ వర్గంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓవైసీని నమ్మేది లేదంటూ మెజార్టీ ముస్లింలు ప్రజలు తేల్చి చెబుతున్నారు.

ముస్లిం ఓట్ల కోసం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ
హైదరాబాద్ నగరంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మైనారిటీ ఓట్ల శాతం 50 శాతం నుంచి 85 శాతం, మరో ఏడు సెగ్మెంట్లలో 20-25 శాతం వరకు ఉంది. హైదరాబాద్ వెలుపల ఉన్న మరో 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లింలు 15-20 శాతం వరకు ఉన్నారు. ఇలా దాదాపు 45 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముస్లింలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్, ఒవైసీ, మజ్లిస్ పార్టీ నేతలను బుజ్జగిస్తున్నప్పటికీ, ముస్లింలకు వారి జనాభా నిష్పత్తిలో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో BRS చాలావరకు విఫలమైంది. ఇది ఒక నిరంతర ఇబ్బందిగా ఉన్నప్పటికీ, BRS ఈసారి ముస్లింలకు మూడు సీట్లు మాత్రమే కేటాయించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని ముస్లింలు ఎలా నమ్ముతార్న భావన కలిగేలా చేసింది. అయితే, రాష్ట్రంలోని 3.20 కోట్ల మంది ఓటర్లలో ముస్లింలు దాదాపు 13 శాతం ఉన్నారు. 6 శాతం ఉన్న రెడ్డిలు 45 సీట్లు సాధించగా, కేసీఆర్‌కు చెందిన చాలా చిన్న సామాజికవర్గమైన వెలమలు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ముస్లిం అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్‌తో సహా రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయ్. ప్రచారానికి మరో మూడు వారాలు గడువుంటే.. గతంలో మాదిరిగా ముస్లింల మద్దతును కేసీఆర్ మళ్లీ గెలుస్తారో లేదో చూడాలి.