ఈసారి 175 స్థానాలు మావే: రోజా
ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దీంతో ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో మీరేం చేశారంటే..మీరేం చేశారంటూ..అధికార,ప్రతిపక్షాలు పరస్పర వాదనలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ మంత్రి రోజా తమ ప్రత్యర్థి పార్టీపై మండిపడ్డారు. ఏపీలో వాలంటీర్లు బస్తాలు మోసే కూలీలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అవమానించారని ఆరోపించారు. కానీ వాలంటీర్లు మాత్రం వాళ్ల పనితీరుతో ప్రతిపక్ష నేతలకు సమాధానం ఇచ్చారన్నారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. కాగా వాలంటీర్లంతా వైసీపీ ప్రభుత్వ సంక్షేమం,అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. కాబట్టే రాష్ట్రంలోని ప్రజలంతా జగన్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ సారి ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీయే గెలుస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.