కేసీఆర్ అందుకే ఓడిపోయారు
తెలంగాణ ప్రజలంతా స్థానికంగా మా ఎమ్మెల్యే ఓడిపోయినా కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అనుకున్నారని, అందరూ అలాగే అనుకోవడంతోనే కేసీఆర్ సీఎం కాలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు . హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం కరీంనగర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రోహిత్ రెడ్డి, డాక్టర్ గౌతమి రెడ్డి దంపతులు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ , బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ ఆగమాగం చేస్తోందని విమర్శించారు . దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకోవడమే బీజేపీకి తెలుసని, కరీంనగర్‌లో ఒక్క బడి గాని గుడి గాని తీసుకురాకపోయిన ప్రజలు బీజేపీకే ఓటు వేసారని ఎద్దేవా చేశారు. బీజేపీ మోసం రాముడికి కూడా అర్థమై అయోధ్యలో వారిని ఓడగొట్టారని, కానీ కరీంనగర్‌లో మాత్రం గెలిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ దొంగ మాటలు హైదరాబాద్ ప్రజలు నమ్మలేదని, కానీ ఊళ్లలో నమ్మి మోసపోయారని ఎద్దేవా చేశారు. జీఎస్టీని ఇప్పుడు ఎత్తేస్తామని కేంద్రం చెప్పడం హాస్యాస్పదమని, మోదీ ఇచ్చిన పదిహేను లక్షల రూపాయల హామీ ఏమైందని ప్రశ్నించారు.