NewsTelangana

ఇదీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుస్థితి..!

పార్టీ నాయకుల పేర్లే పలకలేని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల

కమ్యూనిస్టు నాయకుల పేర్లూ మర్చిపోయిన ప్రభాకర్ రెడ్డి

అభ్యర్థి కూసుకుంట్లనే వెనక్కి పంపించేసిన మంత్రి కేటీఆర్‌

మునుగోడులో బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటూ పరుగులు పెడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులకు ఆరంభంలోనే కష్టాలు ఎదురవుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి దీటైన అభ్యర్థిగా నెల రోజులు తర్జన భర్జన చేసి మరీ ఎంపిక చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. అయితే.. తనకు రాజకీయాలపై కనీస అవగాహన లేదని కూసుకుంట్ల నామినేషన్‌ రోజునే నిరూపించుకున్నారు. పైపెచ్చు.. పార్టీ పెద్దలు కూడా ఆయనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని తేటతెల్లమైంది.

టీఆర్‌ఎస్‌ నాయకుల పేర్లే తెలియదా..?

కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌ రెడ్డి, సీపీఐ నాయకులు సాంబశివరావు, సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి కూసుకుంట్ల మాట్లాడారు. ఇక్కడే ఆయన తన రాజకీయ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్‌ పేరును సైతం ఆయన సరిగ్గా ఉచ్ఛరించలేకపోయారు. కల్వకుంట్ల తారక రామారావు పేరును నందమూరి తారక రామారావు అని పలికారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి పేరును కూడా జగదీశ్వర్‌ రెడ్డిగా చెప్పారు. మా అభ్యర్థికి పార్టీ అధినేత కుమారుడి పేరు, జిల్లా మంత్రి పేరు కూడా తెలియదంటూ పార్టీ కార్యకర్తలు సెటైర్లు విసురుకున్నారు.

కమ్యూనిస్టులతో ఎప్పుడూ మాట్లాడలేదా..?

కూసుకుంట్ల లీలలు అంతటితో ఆగలేదు. టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన కమ్యూనిస్టు నాయకులు కూడా ఆయనకు తెలియదని తేలిపోయింది. సీపీఐ నాయకులు కూనంనేని సాంబశివరావు పేరును సాంబశివదేవు అని.. సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం పేరును తమ్మినేని సీతారాం అని తప్పుగా పలికారు. దీంతో ఆయా నాయకులతో పాటు ఈ ర్యాలీకి వచ్చిన ప్రజలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నవ్వుకున్నారు. ఈ నాయకుడిని గెలిపిస్తే తమనూ మర్చిపోతాడని నియోజకవర్గ ప్రజలు జోకులు పేలుస్తున్నారు.

కూసుకుంట్లను వెనక్కి వెళ్లిపోమన్న కేటీఆర్‌

అంతేకాదు.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఏరికోరి ఎంపిక చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఆ పార్టీ నాయకులే కనీస మర్యాద ఇవ్వడం లేదని నామినేషన్‌ ర్యాలీ సాక్షిగా మునుగోడు ప్రజలు తెలుసుకున్నారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయనను వెనక్కి వెళ్లిపోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. కూసుకుంట్ల మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్లి నిలబడ్డారు. దీంతో మా నియోజకవర్గ అభ్యర్థినే వెనక్కి నెట్టేసిన ఈ నాయకులను చూసి ఓటేయాలా..? అని ప్రజలు నోరెళ్లబెట్టారు. మా అభ్యర్థి పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. గెలిచిన తర్వాత ఆయనను ఎవరు పట్టించుకుంటారు..? ఆయన నిధులు తెస్తాడా..? అని అనుమానం వ్యక్తం చేశారు.

రాజగోపాల్‌ను ఆలింగనం చేసుకున్న అమిత్‌ షా

ఇటీవల కేంద్ర మంత్రి అమిత్‌ షా మునుగోడు వచ్చినప్పుడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకోవడమే కాదు.. ఆలింగనం చేసుకొని ఇచ్చిన గౌరవం ఇవ్వడాన్ని చూసిన మునుగోడు ప్రజలు నాయకుడంటే ఇలా ఉండాలి అనుకున్నారు. ఇలాంటి నాయకుడిని గెలిపిస్తే.. పై నాయకులతో కొట్లాడి అయినా నిధులు తెస్తాడని.. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.