‘కరోడ్‌పతి’లో కోటి గెలిచిన అబ్బాయి సమాధానం ఇదే..
‘కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) ఎన్నో ఏళ్ల నుండి అమితాబ్ వాక్చాతుర్యంతో, సులభంగా అనిపించే ట్విస్ట్ ఉండే ప్రశ్నలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ టీవీషోలో ఇప్పుడు తాజాగా సోనీటీవీలో 16వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు గెలుచుకుని ఘనత సాధించాడు జమ్ముకాశ్మీర్‌కు చెందిన 22 ఏళ్ల చందర్ ప్రకాశ్. అయితే బాధ కలిగించే విషయం ఏమిటంటే అతడికి ఏడుకోట్ల ప్రశ్నకు కూడా సమాధానం తెలుసు. అయితే రిస్క్ తీసుకోకుండా గేమ్ నుండి క్విట్ అయి కోటి రూపాయలు అందుకున్నాడు. అయితే కోటి రూపాయల ప్రశ్న ఏంటనే కుతూహలం అందరికీ ఉంటుంది. అదేంటంటే ఒక దేశంలో అతిపెద్ద రాజధాని కాని నగరం ఉంది. దాని అర్థం అరబిక్ భాషలో అబోడ్ ఆఫ్ పీస్ (శాంతి నివాసం) అని ఉంటుంది. ఆ నగరంలో పోర్టు ఉంది. దానికి గల ఆప్షన్స్ ఏమిటంటే A.సోమాలియా, B.ఒమన్, C.టాంజానియా, D. బ్రూనై వీటన్నింటిలో చందర్ ‘డబుల్ డిప్ లైఫ్‌లైన్’ను ఉపయోగించి ఆప్షన్ C. టాంజానియాను ఎంచుకున్నాడు. ఇది సరైన సమాధానం కావడంతో రూ.కోటి గెలుచుకున్నట్లు ప్రకటించారు అమితాబ్. వెంటనే అమితాబ్ అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కోటి రూపాయలతో పాటు అతడికి కారు కూడా బహుమతిగా వచ్చింది. ప్రకాశ్ ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. తనకు చిన్నవయసు నుండి పేగులో పూడిక కారణంగా ఏడుసార్లు సర్జరీలు చేయించుకున్నానని వివరించారు.