‘ఇది మాది, అప్నా హై’, మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లు మాది అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నందున ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు పార్టీ పేర్కొంది. మంగళవారం పార్లమెంటులో ప్రవేశిస్తున్నప్పుడు బిల్లు గురించి అడిగిన ప్రశ్నకు, “ఇది మాది, అప్నా హై” అని సోనియా అన్నారు. అంతకు ముందు ట్విట్టర్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, “కేంద్ర మంత్రివర్గం నివేదించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బిల్లు వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. “ప్రత్యేక సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో దీని గురించి చాలా బాగా చర్చించి ఉండవచ్చు. రహస్యంగా ఉంచేబదులు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించి ఉండొచ్చని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010 మార్చి 9న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందగా.. లోక్‌సభలో మాత్రం చర్చకు రాలేదు.

