“ఇది ఇండియా కాదు..పంజాబ్”
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ స్వర్ణదేవాలయాన్ని సిక్కులు పవిత్ర స్థలంగా భావిస్తారు. కాగా ఈ స్వర్ణదేవాలయంలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టింస్తోంది. తాజాగా ఓ మహిళ స్వర్ణదేవాలయంలోకి వెళ్తుండగా అక్కడే ఉన్న వ్యక్తి ఆమెను లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. దీనికి ప్రధాన కారణం ఆమె తన ముఖంపై జాతీయ జెండా రంగులను ధరించడమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను అడ్డుకున్న వ్యక్తి “ఇది ఇండియా కాదు..పంజాబ్ అని చెప్పడం” గమనార్హం. దీంతో ఆ మహిళ తనను గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్లనివ్వాలని అతనితో వాగ్వాదానికి దిగింది. కాగా ఆ వ్యక్తి ఇది ఇండియా కాదు..పంజాబ్ అన్నదానిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడింది. పంజాబ్ ఇండియాలోనే కదా ఉందని అతనిని ప్రశ్నించింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..బాగా వైరల్‌గా మారింది. దీంతో ఆ వ్యక్తిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో పంజాబ్‌లో ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సృష్టించిన అల్లర్ల కారణంగా పంజాబ్‌లో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.