‘ఇది అసెంబ్లీ, డబుల్ యాక్షన్ సినిమా కాదు’..జగన్
వైసీపీ నేత జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలపై మండిపడ్డారు. ఇన్ని స్థానాలు వస్తేనే ప్రతిపక్ష హోదా రావాలనేం లేదు. అప్పటిలో ఢిల్లీ అసెంబ్లీలో మూడు స్థానాలు మాత్రమే ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా వచ్చింది అని వ్యాఖ్యానించారు. “అసెంబ్లీలో రెండే పక్షాలుంటాయి. ఏపీలో ఉన్న నాలుగు పార్టీలలో మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండేది వైసీపీనే కదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుండా రెండు వైపులా వాయించుకోవడానికి ఇదేం డబుల్ యాక్షన్ సినిమా కాదు. అధికార, ప్రతిపక్ష పాత్రలు మీరే పోషిస్తారా?” అంటూ ఎద్దేవా చేశారు. లీడర్ ఆఫ్ ది హౌజ్‌కు ఎంతసేపు మైక్ ఇస్తారో.. ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం ఇవ్వాలి. ఇవ్వట్లేదు కాబట్టే మీడియా ద్వారా ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తున్నాను అని పేర్కొన్నారు.