Home Page Sliderhome page sliderNewsTelangana

దుర్గం చెరువు కబ్జా ఇలా జరిగింది

హైదరాబాద్: దుర్గం చెరువు ఏ విధంగా కబ్జా కోరల్లో చిక్కుకుని కుంచించుకుపోయిందో తెలిపే ఆధారాలను హైడ్రా బయటపెట్టింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సహకారంతో సేకరించిన శాటిలైట్ చిత్రాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంతో అలరారిన ఈ ‘సీక్రెట్ లేక్’, దశాబ్దాలుగా సాగిన ఆక్రమణల పర్వంతో నేడు 116 ఎకరాలకు పరిమితం కావడం గమనార్హం.

1976 నాటికే చెరువులో 29 ఎకరాలు కబ్జాకు గురై 131.66 ఎకరాలకు తగ్గింది. 1995 నుంచి 2000 మధ్య మరో 10 ఎకరాలు అన్యాక్రాంతమై 121 ఎకరాలకు పడిపోయింది. 2000 సంవత్సరం నుంచి నేటి వరకు మరో 5 ఎకరాలు కబ్జా కోరల్లోకి వెళ్లినట్లు శాటిలైట్ సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వైపు ఆక్రమణకు గురైన సుమారు 5 ఎకరాల స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక్కడ చెరువులో 10 నుంచి 15 మీటర్ల మేర మట్టిని నింపి, చదును చేసి అక్రమంగా పార్కింగ్ దందాను నిర్వహిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల క్యాబ్‌లు, స్కూల్ బస్సుల పార్కింగ్ కోసం ఈ స్థలాన్ని వాడుతూ, నెలకు రూ.50 లక్షల వరకు అద్దె వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక ప్రజాప్రతినిధి అండదండలతోనే ఎటువంటి రికార్డులు లేకుండా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం.

ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఆక్రమణలను నిర్ధారించుకున్న తర్వాత , పార్కింగ్‌లోని వాహనాలను మంగళవారం ఖాళీ చేయించి ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. చెరువులో నింపిన మట్టిని కూడా త్వరలోనే తొలగించి, సర్వే ఆఫ్ ఇండియా , రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువుకు పూర్వ వైభవం తీసుకువస్తామని అధికారులు తెలిపారు.