Breaking Newshome page sliderHome Page SliderNationalNewsTelanganaviral

ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు . గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని విమర్శించారు. బీసీలను సీఎం రేవంత్ రెడ్డి నిలువునా మోసం చేశారని అన్నారు. పరిపాలన చేతగాక డ్రామాలు ఆడటం అలవాటు అయిపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. బీసీలపై రెడ్డికి చిత్తశుద్ధి లేదని అందుకే ఈ డ్రామా అని విమర్శించారు. కాగా, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్లకు రెండు వారాలు, ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.