బహుళ ప్రయోజనాల మధుర ఔషధం ఈ తేనె
తేనె మానవజీవితంలో చాలా వేల సంవత్సరాల క్రితమే ముఖ్య భూమికను పోషిస్తోంది. ఇప్పుడయితే ప్రతీ చిన్నఅనారోగ్యానికి మందులూ, మాకులూ వాడుతున్నారు కానీ ఒకప్పుడు చిన్నచిన్న అనారోగ్యాలకు తేనెను దివ్యౌషధంగా ఉపయోగించేవారు. పూర్వం నుండీ తేనెను బలవర్థకమైన ఆహారంగా భావించేవారు. రోగనిరోధక శక్తి పెరగడానికి, వివిధ వ్యాధుల నుండి మనలను కాపాడడానికి ఈ తేనెను విరివిగా ఉపయోగించేవారు. మన సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైపోయింది తేనె. దీనిని సుధ అనీ, మధు అనీ కూడా పిలుస్తారు. పువ్వుల నుండి గ్రహించిన మకరందాన్ని కష్టపడి సేకరించిన తేనెటీగలనే కీటకాలనుండి గ్రహించిన అమృతమే ఈ తేనె. తేనెటీగల లాలాజలంతో కలిసి పూవుల మకరందంలోని మంచి గుణాలను పుణికి పుచ్చుకున్న తేనె వలన లాభాలను తెలుసుకుందాం.

పంచామృతాలలో ఒకటిగా వాడే తేనె ఎన్నో వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది.
జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. నిద్రలేమితో బాధపడే వాళ్లకి బాగా పనిచేస్తుంది.
గాయాలను నయం చేసుకోవడానికి, మచ్చలు, ఏర్పడకుండా ఇది నిరోధిస్తుంది.
పంటి చిగుళ్లపై తేనెను రుద్దితే నొప్పి, మంట తగ్గుతాయి.
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి మొటిమల నివారణకు బాగా పనిచేస్తుంది. పంచదారకు బదులుగా తేనెను పాలల్లో వాడడం చాలా మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటి వాటికి సహజ నివారణగా పనిచేస్తుంది.
బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. కొవ్వును కరిగించి, పునరుత్పత్తి శక్తిని పెంచుతుంది. రక్తహీనతతో బాధ పడేవారికి బాగా మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న తేనెను మనం రోజూ తగిన మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుందామా..

