Home Page SliderNationalNewsviral

టాటా గ్రూప్ చరిత్రలోనే ఇది చీకటి రోజుగా మారింది”..ఛైర్మన్

ఇది చాలా కఠిన సమయం. నిన్న జరిగిన ఘటన వర్ణించలేనిది. మేమందరం ఇంకా షాక్ లోనే ఉన్నాం. మనకు తెలిసిన ఓ వ్యక్తిని కోల్పోతేనే ఎంతో బాధపడతాం. కానీ, ఒకేసారి ఇంతమంది చనిపోవడం నిజంగా జీర్ణించుకోలేనిది. టాటా గ్రూపు చరిత్రలో ఇదో చీకటి రోజు. ఈ మాటలు ప్రస్తుతం ఓదార్పును ఇవ్వలేవు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకులకు, గాయాలతో బాధపడుతున్న వారికి అండగా నిలుస్తాం. అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని మీలాగే మేమూ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి సమాచారం లేకున్నా.. తప్పకుండా అన్ని విషయాలు తెలుస్తాయి” అని టాటా గ్రూపు ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయంపై టాటా గ్రూప్ మరోసారి స్పందించింది. తమకు ఇది కష్టమైన సమయమే అయినప్పటికీ.. బాధ్యతల విషయంలో వెనక్కి తగ్గబోమని ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ ఛైర్మన్ పేర్కొన్నారు. సంస్థ చరిత్రలో ఇదో చీకటి రోజుగా పేర్కొన్న ఆయన.. విమాన ప్రమాదం దర్యాప్తు అంశంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎయిరిండియా ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. వారికి అండగా ఉంటాం అని మాటిచ్చారు. ఈ ఘోర ప్రమాదంపై దర్యాప్తులో వాస్తవాలు తెలుస్తాయని, వాటిని తెలియజేయడంలో పూర్తి పారదర్శకత ప్రదర్శిస్తామని టాటా గ్రూపు చైర్మన్ హామీ ఇచ్చారు. విశ్వాసం, సంరక్షణ అనే ప్రాతిపదికతోనే ఈ గ్రూపు నిర్మితమైందన్న ఆయన.. కష్టకాలమైనప్పటికీ బాధ్యతల నుంచి, ఏది సరైందో అది చేయడంలో వెనక్కి తగ్గబోమన్నారు. ఈ నష్టాన్ని తాము కూడా భరిస్తామని, వీటిని ఎన్నటికీ మరచిపోమంటూ ఉద్యోగులకు రాసిన లేఖలో చంద్రశేఖరన్ వెల్లడించారు.