Home Page SliderTelangana

రైతన్నకు నేస్తం ఈ డ్రైవర్ లేని ట్రాక్టర్

రైతు ఇంట్లోనే కూర్చుని పొలం దున్నేస్తే ఎలా ఉంటుంది? రైతులు పొలానికి వెళ్లి ఎండనకా, వాననకా కష్టపడకుండా ట్రాక్టర్‌తో పొలం దున్నే ఆలోచన వరంగల్‌లోని కిట్స్ అధ్యాపకులకు వచ్చింది. డ్రైవర్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకుంటూ, ఎక్సలేటర్ ఇస్తూ, స్టీరింగ్ తిప్పుకుంటూ దానంతట అదే తిరుగుతూ పొలం అంతా కలియతిరుగుతూ,చక్కగా పొలం దున్నిపెడుతుందీ ట్రాక్టర్. వరంగల్ కిట్స్ అధ్యాపకులు అన్నదాతకు సహాయం చేసే ఉద్దేశ్యంతో మూడేళ్లు శ్రమించి డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడిపే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం కింద 2020 ఫిబ్రవరిలో 41 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ట్రాక్టర్‌కు మైక్రో కంట్రోలర్‌ను అమర్చి, క్లచ్, బ్రేకు, ఎక్సలేటర్ తిరగడానికి మూడు యాక్చువేటర్స్ వినియోగించారు. స్టీరింగ్ తిరగడానికి మరో మోటార్‌ను అమర్చారు. ఐవోటీ పరిజ్ఞానంతో క్లౌడ్‌కు సందేశం వెళుతుందని, దానినుండి మొబైల్‌కు ఆదేశాలు వస్తాయని వారు వివరించారు. ఈ ప్రాజెక్టులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి, కో-ప్రిన్సిపల్, సహాయ ఆచార్యుడు, అధ్యాపకుడు సహాయం అందించగా బీటెక్ సీఎస్‌ఈ చివరిసంవత్సరం విద్యార్థి సాకేత్ కూడా పాలుపంచుకున్నాడు. ఇది కాలేజ్ ప్రాంగణంలో నడిపి చూస్తే సమర్థవంతంగా పనిచేసింది. ట్రాక్టర్ ఉన్న రైతులు 20 వేల రూపాయల ఖర్చుతో ఈ సాంకేతికతను అమర్చుకోవచ్చని వారు తెలియజేశారు.