Breaking NewsHome Page Sliderhome page sliderNational

మనుషుల్లో దేవత ఈ డాక్టర్

ఒడిశాకు చెందిన రిటైర్డ్ గైనకాలజిస్ట్ డాక్టర్ కే లక్ష్మీబాయి తన 99వ ఏట అడుగుపెట్టే సమయంలో చేసిన సహాయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నిస్సహాయ, పేద మహిళలకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్స అందాలనే సంకల్పంతో ఆమె భువనేశ్వర్ ఎయిమ్స్‌కు రూ.3.40 కోట్ల పెద్ద మొత్తాన్ని విరాళంగా అందించారు. జీవితాంతం మహిళల ఆరోగ్య సేవకే అంకితమైన ఒక వైద్యురాలు… తన జీవన చరమాంకంలో చేసిన ఈ దాతృత్వం వైద్యరంగానికే కాదు, సమాజానికీ ఒక ప్రేరణగా నిలుస్తోంది. బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ లక్ష్మీబాయి, పేద మహిళలు సరైన చికిత్స అందుకోలేక క్యాన్సర్‌తో ఎలా బాధపడుతున్నారో అనేక దశాబ్దాల వైద్య సేవలో ప్రత్యక్షంగా చూశారు. అదే తనను ఈ భారీ దాతృత్వానికి ప్రేరేపించిందని ఆమెకు దగ్గర వర్గాలు చెబుతున్నాయి.
ఆమె అందించిన రూ.3.40 కోట్లు భువనేశ్వర్ ఎయిమ్స్‌లో గైనకాలజిక్ ఆంకాలజీ కోర్సు, అలాగే ఆధునిక చికిత్సా సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వినియోగించనున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు క్యాన్సర్ చికిత్స అందించేందుకు ఈ విభాగం బలపడటం ఎంతో కీలకమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో యువతుల్లో క్యాన్సర్‌ సమస్యలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని నిరోధించేందుకు టీకాల ప్రాముఖ్యతను గుర్తించిన ఆమె బెర్హంపూర్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీకి మరొక రూ.3 లక్షలు విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని క్యాన్సర్ నివారణ కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు సొసైటీ సెక్రటరీ ఇందిరా పాల్ తెలిపారు.
1926లో జన్మించిన డాక్టర్ కే లక్ష్మీబాయి, 1945లో కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌లో తొలి ఎంబీబీఎస్ బ్యాచ్‌లో చేరడం ఆమెలోని పట్టుదల, సేవాభావాన్ని తెలియజేస్తుంది. ఆ తరువాత మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేసి 1950లో సుందర్‌గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను ప్రారంభించారు. అనేక ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో పనిచేసి వేలాది మంది మహిళలకు సేవలు అందించిన ఆమె, 1986లో ఎంకేసీజీ ఆసుపత్రిలో రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత కూడా సమాజ సేవే తన జీవిత ధ్యేయంగా కొనసాగించారు.
డాక్టర్ లక్ష్మీబాయి విరాళాన్ని ఎయిమ్స్ భువనేశ్వర్ వైద్యులు హృదయపూర్వకంగా అభినందించారు. గైనకాలజిక్ ఆంకాలజీ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంలో ఆమె విరాళం కీలక పాత్ర పోషిస్తుందని ఎయిమ్స్ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స అత్యంత ఖరీదైనదిగా మారిన ఈ రోజుల్లో, పేద మహిళలకు అధునాతన వైద్యం అందాలనే ఆమె సంకల్పం వైద్యరంగానికే ఓ వెలుగు చూపుతోంది. ఎయిమ్స్ భువనేశ్వర్ ఆబ్‌స్టెట్రిక్స్, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సౌభాగ్య కుమార్ జెనా మాట్లాడుతూ, డాక్టర్ లక్ష్మీబాయి చేసిన ఈ మహాదానం ఆమె సేవాభావం, మానవతా గుణానికి ప్రతీక అని అభినందనలు తెలిపారు.