Home Page SliderTelangana

త్యాగధనుల బలిదానాలకు చిహ్నమే ఈ ‘అమరజ్యోతి’

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల గుర్తుగా ఈ అమరజ్యోతి నిత్యం అంతెత్తున ప్రకాశిస్తుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణా దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సభలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, తెలంగాణా రాష్ట్రం ఈ తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని గూర్చి ప్రసంగించారు. వారి స్ఫూర్తితో తెలంగాణా అన్ని రంగాలలో సమున్నతఅభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎన్ని జరిగినా ధైర్యంతో ఎదుర్కొని, తెలంగాణాను సాధించుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణా ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని, గాంధీజీ చూపిన సత్యాగ్రహ పంధాను అనుసరించి, నాటి విద్యార్థులమంతా జయశంకర్ సార్ మార్గదర్శకత్వంలో నడిచామని తెలిపారు. తెలంగాణా ఉద్యమ సమయంలో విద్యార్థుల పోరాటం మరువలేనిదన్నారు. ఇప్పటి వరకూ 600 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చామని, కుటుంబానికి 10 లక్షల రూపాయలతో పాటు, ఇళ్లు కూడా నిర్మించి ఇచ్చామన్నారు. ఇంకా ఎవరైనా వెలుగులోకి రాకుండా ఉంటే వారిని కూడా ఆదుకుంటామన్నారు. తెలంగాణా ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా నిలవాలని, అమరులను స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే అమరజ్యోతిని ఏర్పాటుచేశామన్నారు.

అమరజ్యోతి వద్ద ప్రతిఒక్కరూ నివాళులర్పించాల్సిందే

రాష్ట్రానికి ఎవరు వచ్చినా, విదేశీ పర్యటనలకు ప్రతినిధులు వచ్చినా, రాష్ట్రప్రభుత్వం తరపున ఒక ఆనవాయితీగా మొదట అమరజ్యోతి వద్ద నివాళులర్పించేలా చేస్తామన్నారు. ఒక పక్క 125 అడుగుల ఎత్తున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం, మరోపక్క శాంతి స్థాపకుడు గౌతమ బుద్దుని విగ్రహం, మరోపక్క తెలంగాణా కొత్త సచివాలయం, దాని ఎదురుగానే అమర వీరుల జ్యోతితో ఈ ప్రదేశమంతా విశిష్టతను సంతరించుకుందన్నారు.

గగన తలంలో తెలంగాణా ప్రగతి

ఆకాశంలో అద్భుతంగా 750 డ్రోనల్తో 15 నిముషాల పాటు లేజర్ షో నిర్వహించారు. ఇది చూపరులను కట్టి పడేసింది. తెలంగాణా అమరుల స్మారక జ్యోతి, కాకతీయుల కళాతోరణం, చార్మినార్, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, కాళేశ్వరం ప్రాజెక్ట్, పిడికిలి బిగించి నినాదం ఇస్తున్న కేసీఆర్, అమర వీరు జ్యోతి, జోహార్ అమరులకు అనే నినాదం, అమరులను ధ్రువతారలుగా పోల్చేలా నక్షత్రాలు, నూతన సచివాలయం, టి-హబ్ వంటి దృశ్యాలతో కూడిన చిత్రాలు ఆకాశంలో ఆవిష్కరించాయి. ఈలేజర్ షోను ఐఐటీ దిల్లీకి చెందిన స్టార్టప్ కంపెనీ నిర్వహించింది.