NewsTelangana

ఓటుకు రూ.30 వేలు అన్నారు.. ఇంతేనా..!

మునుగోడు ఉప ఎన్నికలో రెండు నెలల హోరాహోరీ ప్రచారం ముగిసింది.. రేపటి పోలింగే మిగిలింది. ఈ మధ్యలో పంపకాల పర్వం ప్రారంభమైంది. ఓటింగ్‌ స్లిప్‌లతో పాటు డబ్బులను, మద్యం బాటిళ్లను రహస్యంగా పంచుతూ.. తమ అభ్యర్థికే ఓటేయాలంటూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలు ప్రారంభమయ్యాయి. అయితే.. ప్రచారం సందర్భంగా అంతన్నారు.. ఇంతన్నారు.. ఇప్పుడు తుస్సుమంటున్నారు.. అంటూ ఓటర్లు తెగ ఆవేదన చెందుతున్నారు. రూ.40 వేలు, రూ.50 వేలు అన్నారు.. తులం బంగారం, వాషింగ్‌ మిషన్‌, ఫ్రిజ్‌, బైక్‌ అన్నారు.. గోవా ట్రిప్‌, ఫుల్‌ బాటిల్‌.. అంటూ హోరెత్తించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇంతే ఇస్తారా.. అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండో రౌండ్‌ పంపకాలకూ ప్లాన్‌..

రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నాయని.. మరో పార్టీ వెయ్యి రూపాయలే ఇస్తోందని ఓటర్లు అలిగారు. డబ్బులు ఇచ్చేందుకు పార్టీ కార్యకర్తలు వెళ్తే.. మరీ ఇంత తక్కువా.. అని వాపోతున్నారట. హైదరాబాద్‌ తదితర దూరపు ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు మాత్రం రూ.5 వేలతో పాటు ప్రయాణ ఖర్చులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పురుష ఓటర్లకు క్వార్టర్‌ బాటిల్‌ ఇస్తే.. ఫుల్‌ బాటిల్‌ అడుగుతున్నారట.. ఇంటికి కిలో చికెన్‌ కూడా పంపిణీ చేస్తున్నారట. అయితే.. ప్రత్యర్థి పార్టీ వాళ్లు ఎక్కువ డబ్బులు పంచితే.. సాయంత్రం రెండో రౌండ్‌ పంపకాలకూ నాయకులు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. చివరి నిమిషంలో రూ.10 వేలైనా ఇస్తారనే ఆశతో ఓటర్లు ఉన్నారు.

స్థానికుల ఇళ్లల్లోకి స్థానికేతరులు..

ఓటర్లకు నగదు పంపిణీ చేసే బాధ్యతను పార్టీలన్నీ స్థానికులకే అప్పగించాయని సమాచారం. ఒక పార్టీ మాత్రం నగదు పంపిణీ కోసం గ్రామానికి ఒక ప్రత్యేక కమిటీనే వేసిందట. కమిటీలో ఇద్దరు స్థానికులు, మరో ఇద్దరు స్థానికేతరులు ఉన్నట్లు సమాచారం. ఒక పార్టీ అయితే 100 మంది ఓటర్లకు 10 మంది బాధ్యతలను నియమించడం విశేషం. స్థానికేతరులు ఉండొద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, లాడ్జీలను ఖాళీ చేసిన స్థానికేతరులు స్థానికుల ఇళ్లకు మకాం మార్చారని తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే.. ఒక పార్టీ వాళ్లు డబ్బులు పంచుతుంటే రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు మరో పార్టీకి చెందిన కార్యకర్తలు రాత్రుళ్లు కాపలా కాస్తున్నారు.