ఒంటరిగా నివసించడమే వారికి ఇష్టం..
దేశంలో వయసు మళ్లిన వారిలో ఒంటరిగా నివసించే ధోరణి పెరుగుతోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆర్థిక, సామాజిక స్వతంత్రతపై ప్రాధాన్యం పెరగడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. ‘ఏజ్వెల్ ఫౌండేషన్’ అనే సంస్థ సెప్టెంబరులో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లోని 10 వేల మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. దాని ప్రకారం.. 14.3 శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నట్లు వెల్లడైంది. ఇది పట్టణ ప్రాంతాల్లో 15 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 13.4 శాతంగా ఉంది. ఒంటరిగా ఉంటున్న వారిలో 41.9 శాతం మంది ఐదేళ్లకు పైబడి వేరుగా ఉంటున్నారని, ఇందులో 46.5 శాతం మంది మహిళలే ఉన్నారని తేలింది. ఇలా నివసిస్తున్న వారిలో మొత్తంగా 46.9% మంది తాము సంతోషంగా ఉన్నామని చెప్పగా.. 41.5% మంది అసంతృప్తిగా ఉన్నా మని తెలిపారు. ఒంటరిగా ఉండటం వల్ల తమ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని 41% మంది పేర్కొనగా.. తమ ఆరోగ్యం బాగుంటోందని 32% మంది తెలిపారు.

