NewsTelangana

విమోచన అంటేనే భయపడ్డారు

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఏ ప్రభుత్వమూ, ఏ పార్టీ సాహసం చేయలేదని, బీజేపీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం మాత్రమే ఆ సాహసం చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వరంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్‌ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. 12 బృందాలతో కూడిన పారామిలటరీ బలగాల పరేడ్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు అమర వీరుల స్థూపం, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళి అర్పించారు.

నిజాం లొంగుబాటు చరిత్రలో లిఖించదగిన ఘట్టం

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని పార్టీలూ భయపడ్డాయని.. ప్రధాని మోదీ ఆదేశంతో బీజేపీ ఆ పని చేసిందని కొనియాడారు. దేశమంతటికీ 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్రం లభిస్తే.. హైదరాబాద్‌ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబరు 17వ తేదీన విముక్తి లభించిందన్నారు. సర్దార్‌ పటేల్‌ ఎదుట నిజాం నవాబు లొంగిపోవడం ప్రపంచ చరిత్రలోనే లిఖించదగిన ఘట్టంగా నిలుస్తుందన్నారు. నిజాం, రజాకార్ల దురాగతాలకు నాటి హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ ‘ఆపరేషన్‌ పోలో’ ద్వారా ముగింపు పలికారని వివరించారు. హైదరాబాద్‌ ప్రజలకు రాచరికపు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు వేలాది మంది ప్రాణాలు అర్పించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

ఓటు బ్యాంకు రాజకీయాలు..

విమోచన దినాన్ని కొందరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని అమిత్‌ షా విమర్శించారు. తెలంగాణాను పాలించిన పార్టీలన్నీ ఓటు బ్యాంకు కోసమే తాపత్రయపడ్డాయని, విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు భయపడ్డాయని ఆరోపించారు. ఈ వేడుకలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే హాజరయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. డప్పు దరువులు, ఒగ్గు కథలతో హోరెత్తించారు.