‘ఒలింపిక్స్‌లో గెలిచినా పట్టించుకోవట్లేదు’..మను తండ్రి ఆవేదన
2024 ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను బాకర్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ దక్కుతుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి రామ్ కిషన్ మర్చంట్ నేవీలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయంపై ఆయన స్పందించారు. మనుబాకర్ దేశం కోసం విజయాలు సాధిస్తూ గుర్తింపు కోసం తపిస్తోందన్నారు. గత మూడేళ్లుగా ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘ఖేల్‌రత్న’ వంటి పురస్కారాల కోసం దరకాస్తు చేస్తూనే ఉందని, కానీ పురస్కారాలు రావడం లేదని వాపోయారు. ఒలింపిక్స్‌లో ఆడి గెలిచినా భారత్‌లో విలువ లేదన్నారు. రెండు పతకాలు గెలిచినప్పటికీ ‘ఖేల్‌రత్న’ కోసం మనును పట్టించుకోవట్లేదని బాధను వ్యక్తం చేశారు. అయితే దీనికోసం దరకాస్తు చేసుకునే అవకాశాన్ని అథ్లెట్లకు కల్పించారు. ఇంకా తుది జాబితా సిద్ధం కాలేదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నత వర్గాలు పేర్కొంటున్నాయి. 12 మందితో కూడిన జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్, పారాలింపిక్స్ హైజంప్‌లో పసిడి పతకం గెలిచిన ప్రవీణ్ కుమార్ పేర్లను ప్రతిపాదించింది. మను పేరును ఈ కమిటీ ప్రతిపాదించలేదని, ఆమె దరకాస్తు చేయలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె తండ్రి ఇలా స్పందించారు.


 
							 
							