రథసప్తమి రోజు అవన్నీ రద్దు..టీటీడీ
తిరుమలలో రథసప్తమి రోజు బ్రహ్మోత్సవాల తరహాలో వాహన సేవలు ఉంటాయని, దానికోసం వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో పేర్కొన్నారు. రథసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేడుకల ఏర్పాట్లను అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్షించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. శ్రీవారి ఉత్సవాలలో రథసప్తమి అత్యంత ముఖ్యమయ్యిందని, ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్యజయంతి సందర్భంగా తిరుమలలో వైభవంగా నిర్వహిస్తామన్నారు. లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ వంటి అన్ని దర్శనాలు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.