భామలను చూసేందుకు టైం ఉంది కానీ.. బాధలు వినేందుకు టైం లేదా..?
మిస్ వరల్డ్ పోటీలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. అందాల పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి ఐదు సార్లు అటెండ్ అయ్యాడని, అందాల భామలను చూసేందుకు టైమ్ ఉంది కానీ.. ఒక్కసారైనా జిల్లాల్లో మార్కెట్ యార్డులకు వెళ్లి వడ్లు ఎందుకు కొనట్లేదని ప్రశ్నించేందుకు టైమ్ దొరకట్లేదా అని ధ్వజమెత్తారు. జనుము, జీలుగు విత్తనాలు ఎందుకు దొరకడం లేదంటూ అన్నదాతల కష్టాలను అడిగి తెలుసుకునేందుకు సమయం లేదా ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి వేరే పని ఏమి లేదంటూ ఎద్దేవా చేశారు. అందాల పోటీల్లో పొల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల కాంగ్రెస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. దీంతో దేశ ప్రతిష్టతో పాటు రాష్ట్ర పరువును ప్రభుత్వం గంగలో కలిపేసిందని ఆక్షేపించారు. వేధింపులకు గురైన మహిళ ఎంతలా బాధిపెడితే.. అలా పోటీలోంచి వైదొలిగిపోయి ఉంటుందని హరీశ్ రావు అన్నారు.