కూటమి ప్రభుత్వంలో అంత అన్యాయమే
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో జరిగిన పార్టీ అవగాహన సదస్సులో మాట్లాడుతూ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలు పోలీసులు అండతో దౌర్జన్యాలు చేశారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్, పార్టీ నేత వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ బలోపేతంపై నేతలు సూచనలు ఇచ్చారు. బాధితులపైనే కేసులు పెడుతున్న పోలీసు వ్యవస్థ దారుణమైందని విమర్శించిన అవినాష్‌రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, నిరుద్యోగులకు భృతి, మహిళలకు సంవత్సరానికి 18 వేల రూపాయల పథకం వంటి కీలక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని ఆరోపించారు. పులివెందుల మెడికల్ కాలేజీ 50 సీట్లు వెనక్కు పంపడం, అరటి కోల్డ్ స్టోరేజ్‌ను నిర్వీర్యం చేయడం వంటి చర్యలు కూటమి ప్రభుత్వ తీరును ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. ప్రజల్లో ఆదరణ లేక టీడీపీ నాయకులు క్రైం రాజకీయాలను నమ్ముకుంటున్నారని అవినాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గూండాల దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

