తెలంగాణ లో ఒక్క హైడ్రో ప్రాజెక్టు లేదు
పరిశుభ్ర శక్తిని ప్రోత్సహిస్తున్నామనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు విరుద్ధంగా, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఒక్క చిన్న హైడ్రో పవర్ (SHP) ప్రాజెక్టు కూడా స్థాపించలేదు. ఈ విషయం కేంద్ర పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 12 కొత్త SHP ప్రాజెక్టులు (మొత్తం సామర్థ్యం 97.30 మెగావాట్లు) అమలులోకి వచ్చాయి. అలాగే 90 ప్రాజెక్టులు (439.90 మెగావాట్ల సామర్థ్యంతో) నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో మాత్రం గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఒక్క కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడమే కాదు, అమలులో ఉన్నదీ ఏదీ లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో మొత్తం 94 చిన్న హైడ్రో ప్రాజెక్టులకు (102.25 మెగావాట్ల సామర్థ్యంతో) అవకాశం ఉన్నదిగా గుర్తించారు. 2023–24 వరకు 30 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి (90.87 మెగావాట్ల సామర్థ్యంతో). ఈ ఏడాది గడువు పూర్తయ్యేలోగా కొత్తగా ఒక్కదాన్ని కూడా ప్రారంభించకపోవడం ప్రభుత్వ హరిత శక్తి పథకాలపై సందేహాలు కలిగిస్తోంది.ఇతర రాష్ట్రాలు మునుముందుగా వ్యవహరిస్తుండగా, తెలంగాణ వెనుకబాటులో ఉండడం గమనార్హం. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో 1.20 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టు అమలులో ఉంది. కర్ణాటకలో అయితే 4 మెగావాట్ల సామర్థ్యంతో ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడమే కాక, మరో ఐదు ప్రాజెక్టులు కూడా నిర్మాణంలో ఉన్నాయని నివేదిక తెలిపింది.