NewsTelangana

నా కుమార్తెను బీజేపీలోకి రావాలని అడిగారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 3 గంటలపాటు సమావేశం కొనసాగింది. సీఎం మాట్లాడుతూ… బీజేపీ నుంచి ఎదురయ్యే దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు. బీజేపీతో పోరాడాల్సిందేనని కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ ఫిరాయింపులో భాగంగా తన కుమార్తెను కూడా బీజేపీలోకి రమ్మని అడిగారని… ఇంతకంటే ఘోరం ఉంటుందా?’ అని ప్రశ్నించారు. ఎక్కడ కేంద్ర సంస్థలు దాడులు చేస్తే… అక్కడే ధర్నాలు చేయండి అని కేసీఆర్‌ చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చట్టం తన పని తాను చేస్తోందని తెలిపారు. సీబీఐ, ఈడీ దాడులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రస్తావనను కేసీఆర్‌ తీసుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీ సీఎం జగన్‌ అనుకూలంగానే ఉంటున్నారని కేసీఆర్‌ అన్నారు. ఓ వైపు తమకు జగన్‌ అనుకూలంగా ఉన్నా ఆయన నేతృత్వంలోని వైసీపీని దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా అని కేసీఆర్‌ నిప్పులు చెరిగారు.

షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు సీఎం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. మళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని కేసీఆర్‌ సూచించారు.

సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని సీఎం తెలిపారు. నూటికి నూరు శాతం మళ్లీ టీఆర్‌ఎస్‌దే అధికారమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. లబ్దిదారుల పూర్తి సమాచారం ఎమ్మెల్యేల వద్ద ఉండాలన్నారు.