Home Page SliderTelangana

ప్రజల డబ్బుతో జరిగే ప్రభుత్వ పనుల్లో గోప్యత అవసరం లేదు..ఉత్తమ్‌కుమార్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటు చాలా తీవ్రమైన ఘటన అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జలసౌధలో ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రజల డబ్బులతో జరిగే ప్రభుత్వ పనుల్లో గోప్యత, రహస్య ఉత్తర్వులు ఉండకూడదన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల నిర్మాణంలో గోప్యత, అవినీతి ఎందుకన్నారు. వీటిని తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నామనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విచారణకు ఆదేశిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలలో ఒక్క రూపాయి కూడా వృధా చేసినా సహించేది లేదన్నారు. ప్రాజెక్టులకు పెడుతున్న ఖర్చు, దానివల్ల లాభాల నిష్పత్తిని అంచనా వేస్తూ నివేదికలను రూపొందించుకోవాలి. గత ప్రభుత్వం డాక్టర్ బాబా సాహెబ్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని, పేరును మార్చి, ఖర్చులు పెంచి కాళేశ్వరం చేపట్టింది. దీనిపై కూడా పరిశీలనలు చేస్తాం అని మంత్రి పేర్కొన్నారు.