Home Page SliderNational

చంద్రయాన్ రోవర్ పనిపై ఇక ఆశలు లేవు

భారత్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత శిఖరాలకు చేర్చి,  చంద్రుని వరకూ వ్యాపింపజేసిన చంద్రయాన్ 3 రోవర్ పనిపై ఇక ఆశలు వదులుకున్నట్లేనని ఇస్రో శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్ తెలియజేశారు. చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను అక్కడ సూర్యోదయమైనప్పటి నుండి మేలుకొలపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 22న సూర్యోదయం కాగా ఇప్పటికి 15 రోజులు కావస్తోంది. అక్కడ మళ్లీ సూర్యాస్తమయ్యే సమయం వచ్చేస్తోంది. దీనితో అక్కడ ఏర్పడే విపరీత శీతల ఉష్ట్రోగ్రతలలో అవి ఇంక మేలుకొనే ప్రసక్తి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పటికే భారత్ అనుకున్న ఫలితం సాధించిందని, ఏ దేశానికీ సాధ్యపడని చంద్రుని దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యమయ్యిందని పేర్కొన్నారు. అంతేకాక 14 రోజుల పాటు చంద్రుని ఉపరితలాన్ని గురించి విలువైన సమాచారాన్ని అందించాయని చంద్రయాన్ 3 లక్ష్యం నెరవేరినట్లేనని వ్యాఖ్యానించారు. మరింత టెక్నాలజీ అభివృద్ధితో త్వరలో చంద్రుని వద్ద నుండి భవిష్యత్తులో నమూనాలను సేకరించే ప్రాజెక్టులు ఉండవచ్చని తెలియజేశారు.