Andhra PradeshHome Page Slider

పొత్తులో సీఎం ప్రస్తావన లేదు, ఆ ఉద్దేశమే లేదు.. పవన్ స్పష్టీకరణ (Big Breaking News)

సీఎంపై ఆశలేదు, అడిగేందుకు నైతికత లేదు
టీడీపీతో పొత్తు విషయంపై పవన్ క్లారిటీ
వైసీపీని ఓడించడమే లక్ష్యమని స్పష్టీకరణ
కుమారస్వామి అంత సీన్ లేదన్న పవన్

టీడీపీతో పొత్తు విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు జనసేనాని పవన్ కల్యాణ్. సీఎం పీఠం తనకు ముఖ్యం కాదని, సీట్ల విషయంలోనూ పలానా విధంగా వ్యవహరించాలన్నది ఏమీ లేదని తేల్చేశారు. తన లక్ష్యం ఏంటో సూటిగా, స్పష్టంగా మరోసారి చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయన్న పవన్… అదేం అంత తేలికైన విషయం కాదన్నారు. చాలా చాలా ప్రతికూల పరిస్థితుల్లో 7 శాతం ఓట్లు సాధించడం ఆషామాషీ కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7 శాతమే ఓట్లుంటే… కొన్నిచోట్ల జనసేనకు 30 నుంచి 18 శాతం వరకు కూడా ఓట్లున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన 137 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టిందని… గెలుస్తామనే అభ్యర్థుల్ని నిలబెట్టలేదని… ఆ రోజు కూడా ముఖ్యమంత్రి అవుతానా, అని కూడా తాను భావించలేదన్నారు. ఆ రోజు అభ్యర్థుల్ని నిలబెట్టగలగడమే గొప్ప విషయమన్నారు. ప్రజల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలన్నదే 2019లో తన లక్ష్యమన్నారు. 2014-19 మధ్య రాష్ట్రమంతటా అధ్యయనం చేసి… 2019లో పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా, అభ్యర్థుల్ని బరిలో నిలిపామన్నారు పవన్.

బీజేపీని పొత్తుకు ఒప్పిస్తా

వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తుంటే సంతోషించేవారిమన్న పవన్… తమను హింసించినా పెద్దగా పట్టించుకునేవారం కాదన్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి అస్తవ్యస్థం చేశారని… అందుకే చూస్తూ ఊరుకోలేకపోతున్నామన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు ఊరుకుంటామన్నారు. ప్రతి ఒక్కరిని హింసిస్తుంటే కచ్చితంగా ఎలయన్స్ పెట్టుకొని, వైసీపీని ఓడిస్తామన్నారు. పొత్తు కోసం మాట్లాడుతూనే ఉంటామన్నారు. అలయన్స్ కోసం ఒప్పిస్తామన్న పవన్, కొందరు అందుకు ఒప్పుకోకపోవచ్చన్నారు. వాస్తవాలను చూపించి, పొత్తుకు ఒప్పిస్తామన్నారు. పరోక్షంగా పొత్తుకు బీజేపీని ఒప్పిస్తానన్న దీమాను పవన్ వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లినప్పుడు, నడ్డాను కలిసి బయటకు వచ్చాక కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానన్నారు. పొత్తుల విషయంలో తన స్టాండ్ మారదన్నారు. పొత్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బంది వచ్చిందన్నారు. మీరు ఢిల్లీ వెళ్లి ప్రాధేయపడటమేంటన్న భావన వచ్చిందని, మీరు తగ్గడమేంటని కొందరు విమర్శించారని.. వారందరూ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు పవన్.

అసలు సీఎం పీఠం ఎలా అడుగుతాను!

మరికొందరు మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే తప్ప అలయన్స్ పెట్టుకోవద్దని గట్టిగా వాదనలు విన్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటేనే పొత్తు పెట్టుకోవాలంటున్నారని… ఇదే విడ్డూరమని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. 137 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ప్రజల రెస్పాన్స్ బేరీజు వేసుకున్నామన్నారు. జనసేన ఒంటరిగా వెళ్లాలంటే. ముఖ్యమంత్రి స్థాయిని కోరుకోవాలంటే తాము 137 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 30-40 స్థానాల్లో గెలిపించి ఉంటే.. ఆ వాదనకు బలం చేకూరేదన్నారు. ఇప్పుడు సీఎం పీఠం లేకుంటే పొత్తు వద్దని చెప్పేవారంతా ఆ రోజు మద్దతివ్వలేదని… కనీసం తనకు కన్పించలేదన్నారు. అలాంటివాళ్లంతా ఇప్పుడు, సీఎం పీఠం ఇస్తేనే పొత్తు పెట్టుకోండని చెప్పడమేంటని ప్రశ్నించారు పవన్. 137 స్థానాల్లో 30-40 వచ్చి ఉంటే కుమారస్వామిలా కర్నాటకలోలా వ్యవహరించి ఉండేవాళ్లమన్నారు. నాడు 40 స్థానాలైనా వచ్చి ఉంటే, ఇప్పుడు పొత్తులో భాగంగా సీఎం పోస్ట్ డిమాండ్ చేసేవాళ్లమన్నారు. పెద్దన్న పాత్ర వహించడమంటే బాధ్యత అన్నారు పవన్. పొత్తు అన్నది, ఎన్నిక అన్నది కులానికి సంబంధించి వ్యవహారం కాదని.. రాష్ట్రానికి సంబంధించినదన్నారు. ఒక కులం కోసం పనిచేస్తే రాజకీయం అవదన్నారు. తాను ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తినన్న పవన్, అన్ని కులాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అలయన్స్ ఉంటుందన్నారు. ముందస్తు వస్తే… జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో తిరుగుతామన్నారు.