“రంగుల మేడలు, అద్దాల గోడలు ఉంటే అభివృద్ధి కాదు”..రేవంత్ రెడ్డి
ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను సరికొత్తగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగుల మేడలు, అద్దాల గోడలు ఉంటే అభివృద్ధి జరిగినట్లు కాదు. ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పులు రావాలి. దానికి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరగాలి.
విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్
తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. సగర్వంగా చాటాలి. అందుకే ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను, శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో భేటీ అయ్యాం. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించాం. ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం. బేగరి కంచె వద్ద శంకుస్థాపన చేసుకున్న ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ, తదితర ఆలోచనలను వారితో పంచుకున్నాం. జనవరిలో దావోస్ పర్యటనలో భాగంగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక రికార్డు. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం ప్రారంభించింది. మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనకు ఇవి దోహదం చేస్తాయని మేం విశ్వసిస్తున్నాం.
నగరానికి హైడ్రా సేవలు
కొత్త నగర నిర్మాణమే కాదు. ఉన్న నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి హైడ్రా అని కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించిన పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించాం.
యువతకు ఉద్యోగావకాశాలు
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను విజయవంతంగా జరిపించాం. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ని విజయవంతంగా నిర్వహించాం. ఉద్యోగ నియామక వయోపరిమితిని కూడా 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళకు పెంచాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించాం. ఇటీవలే శాసనసభలో జాబ్ క్యాలెండర్ ను ప్రవేశ పెట్టాం. దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం” అంటూ వ్యాఖ్యానించారు.

