Home Page SlidermoviesNational

సినిమా టైటిల్ విషయంలో కోలీవుడ్ హీరోల మధ్య వివాదం

ఒక సినిమా టైటిల్ విషయంలో కోలీవుడ్ తమిళ సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోల మధ్య వివాదం చోటు చేసుకుంది. ‘పరాశక్తి’ అనే సినిమా టైటిల్ చిత్రీకరణ దశలో ఉన్న రెండు సినిమాలకు పెట్టడం ఆశ్చర్యంతో పాటు వివాదానికి కారణమయ్యింది. ‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోనీ తన బ్యానర్‌పై తాను గతేడాది జూలైలో ఈ పరాశక్తి టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకున్నానని పేర్కొన్నారు. తమిళంలో ఈ చిత్రం పేరు ‘శక్తి తిరుమగణ్’ కాగా, తెలుగులో ‘పరాశక్తి’ టైటిల్‌ను ఉపయోగించుకునేలా ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన అధికారిక పత్రాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి విజయే నిర్మాతగా వ్యవహరిస్తుండగా, అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇదే ‘పరాశక్తి’ టైటిల్‌తో శివకార్తికేయన్ హీరోగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో సుధాకొంగర దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో స్టార్ హీరో జయం రవి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ టైటిల్‌ను బుధవారం సాయంత్రం ప్రకటించారు. ‘పరాశక్తి’ పేరుతో తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుందని టీమ్ వెల్లడించింది. దీనితో ఈ టైటిల్ కోలీవుడ్‌లో చర్చలు, వివాదాలకు దారి తీస్తోంది.