నాడు తండ్రి.. నేడు కుమారుడు
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ వచ్చే నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యాయవాదుల కుటుంబానికి చెందిన చంద్రచూడ్‌కు ఈ బాధ్యత కొత్తేమీ కాదు. ఆయన తండ్రి వైవీ చంద్రచూడ్ కూడా గతంలో భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1978 ఫిబ్రవరి 2 నుంచి 1985 జూలై 11 వరకు వైవీ చంద్రచూడ్ సుప్రీం చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న డీవై చంద్రచూడ్ మళ్లీ ఇంతకాలానికి దేశ అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవిని అలంకరించనుండటం విశేషం.

ఉదారవాద న్యాయమూర్తి..
ఉదారవాద న్యాయమూర్తిగా గుర్తింపు పొందిన డీవై చంద్రచూడ్ ఇటీవల పలు చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. 24 వారాల వరకు గర్భస్రావం చేయించుకునే హక్కును సమర్ధించారు. ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన ధర్మాసనంలో చంద్రచూడ్ ఒకరు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లే హక్కును కల్పించిన బెంచ్‌లోనూ ఆయన ఉన్నారు. అయోధ్య-బాబ్రీ మసీదు కేసును పరిష్కరించిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ సభ్యుడు.

ముంబై నుంచి ఢిల్లీకి..
భారత ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ 2024 నవంబరు 10 వరకూ కొనసాగుతారు. ఆయన 1998లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వహించారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఢిల్లీ వెళ్లారు. ఆయన 1959 నవంబరు 11వ తేదీన ముంబైలో జన్మించారు. బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగానూ పనిచేశారు.