పంతాలతో ఆగిన పెళ్లి..జరిగిందిలా..
ఒక ఐపీఎస్‌కు జరగాల్సిన పెళ్లి ఒక రోజు పాటు పంతాలు, పట్టింపులతో ఆగిపోయింది. చివరకు ఒకరోజు ఆలస్యంగా జరిగింది. దీనితో ఇరు వర్గాల వారు ఊపిరి పీల్చుకున్నారు. విషయమేమిటంటే గుంటూరుకు చెందిన నవీన్ చక్రవర్తి గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. ఇటీవలే ఎస్పీగా నియమింపబడ్డారు. ఆయనకు తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్తె ప్రణయ దీపికతో వివాహం నిశ్చయమైంది. ఆమె కూడా ఉన్నత చదువులు చదివింది. వీరిద్దరికీ డిసెంబర్ 17న వివాహం జరగాల్సి ఉంది. గుంటూరులోని డాన్ బోస్కో చర్చిలో వీరి వివాహం జరగాల్సి ఉండగా, అది కాస్త అమ్మాయి పట్టింపుతో వాయిదా పడింది. వారు చర్చికి రావడానికి పంపిన కారును కాదని, తన తండ్రి బహుమతిగా ఇచ్చిన కారులో చర్చికి వస్తానని చెప్పింది. దీనితో పెళ్లికుమారుడి తరపువారు కూడా వాగ్వాదానికి దిగారు. ఈ గొడవతో పాటు ఎమ్మెల్యేకు చెందిన కాంగ్రెస్ పార్టీ జెండాలతో హల్ చల్ చేశారు. పెళ్లి కుమారుడు తాను ఐపీఎస్ ఆఫీసర్‌నని, తన పెళ్లిలో రాజకీయం వద్దని పట్టుపట్టాడు. ఈ ఘటనల వల్ల గొడవ జరిగి పెళ్లి ఆగిపోయింది. అయితే పలువురు పెద్దలు కల్పించుకుని సలహాలు ఇవ్వడంతో ఇద్దరూ రాజీకి వచ్చి, ఒకరోజు ఆలస్యంగా డిసెంబర్ 18న జరిగింది. దీనితో ఇరువర్గాలు శాంతించాయి.