మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావు..?
1986లో ఏర్పాటైన ఎన్టీయార్ యూనివర్సిటీతో వైఎస్సార్‌కు సంబంధం ఏమిటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎన్టీయార్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి మీ తండ్రి పేరు ఎలా పెట్టుకుంటావని జగన్‌ను నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు కొనసాగాల్సిందే అన్నారు. ఉన్న వర్సిటీల పేరు మారిస్తే సీఎం జగన్‌కు పేరు రాదని.. కొత్త సంస్థలను నిర్మిస్తే పేరు వస్తుందని హితవు చెప్పారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో నాటి సీఎం ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క యూనివర్సిటీ కూడా నిర్మించలేని ఈ ప్రభుత్వం ఉన్న వర్సిటీ పేర్లనే మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ వర్సిటీకి చెందిన రూ.450 కోట్ల నిధులను కూడా జగన్ సర్కారు కాజేసిందని ఆరోపించారు.