హమాస్ ‘గెటవుట్’ అంటూ గాజా ప్రజల ఆందోళన..
హమాస్‌ను ఇక ఉపేక్షించేదిలేదంటూ గాజా ప్రజలు తిరుగుబాటు చేశారు. “హమాస్ గెటవుట్, యుద్ధాన్ని ఆపాలి, మేం శాంతియుతంగా జీవించాలనుకుంటున్నాం..” అంటూ గాజా ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. హమాస్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌తో ఇక ఘర్షణ చాలంటూ ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాలలో వందలాది మంది పాలస్తీనియన్లు ప్లకార్డులతో తమ డిమాండ్లను ప్రదర్శించారు. ఈ యుద్ధం ప్రారంభం నుండి గాజాలో హమాస్‌కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల కాల్పుల విరమణ అమలులో ఉండగానే ఇజ్రాయెల్ మళ్లీ దాడులను మొదలుపెట్టడంతో గాజా విలవిల్లాడిపోతోంది. దాదాపు రెండేళ్లుగా ఎడతెగని యుద్ధంతో గాజా దాదాపు స్మశానంలా మారింది. గాజా ప్రజల కోసం హమాస్ తన అధికారాన్ని వదులుకోవాలని వారు ప్రశ్నిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుద్ధం కారణంగా దాదాపు 50 వేల మంది పాలస్తానీ ప్రజలు మరణించగా, మరో 1.13 లక్షల మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.


 
							 
							