Home Page SliderNational

భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు..స్పందించిన కేంద్రమంత్రి

విమానం టికెట్ట ధరలు అకస్మాత్తుగా, భారీగా పెరుగుతున్నాయంటూ పలువురు ఎంపీలు నేడు లోక్‌సభ సమావేశాలలో ఫిర్యాదు చేశారు. దీనితో స్పీకర్ ఈ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ అంశంపై దర్యాప్తు చేపడతామని, సామాన్యపౌరులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండేలా చూస్తామని మాటిచ్చారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఈ సమస్యను లేవనెత్తారు. తాను చెన్నై నుండి ఢిల్లీకి ఎయిర్ విస్తారాలో టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రూ. 25 వేలు చూపించిందని, బుకింగ్ పూర్తయ్యాక పేమెంట్ చేసే సమయంలో మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. మాకు వినియోగదారుడి ప్రయోజనాలే ముఖ్యం అని, సెలవు రోజుల్లో ధరలు అధికంగా ఉంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయని, దానిపై దర్యాప్తు జరుపుతామన్నారు. రద్దీ, ఇంధన ధర, సెలవులు వంటి అంశాల ప్రభావం వల్ల విమాన టికెట్ల ధరలలో పెంపు ఉంటోందని పేర్కొన్నారు.